ప్రభుత్వ అనుకూల ప్రచారం చేయడానికి టూల్స్ గా గ్రామ వాలంటీర్లను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాడుకుంటున్నదనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలను అమలుచేస్తూ.. జగన్ ఓడిపోతే గనుక.. ఈ పథకాలు ఏవీ మీకు అందవు.. మీరు వీటన్నింటినీ కోల్పోతారు అనే భయాన్ని వారి నరనరాల్లోకి ఎక్కిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. వాలంటీర్ల వ్యవస్థను అడ్డగోలుగా పార్టీకోసం వాడుకోవడం ద్వారా మాత్రమే మళ్లీ అధికారంలోకి రావాలని భావిస్తోంది. వాలంటీర్లకు జీతాలుగా ప్రభుత్వ సొమ్ము ఇస్తూ.. వారిసేవలను మాత్రం పార్టీ ప్రయోజనాలకు వాడుకుంటున్న తీరు ఇది. అయితే వాలంటీర్ల విషయంలో జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని, వారి ద్వారానే గెలవాలని చూస్తున్న రహస్యాన్ని మంత్రి విశ్వరూప్ తాజాగా మరోసారి ధ్రువీకరించారు.
వాలంటీర్ల వ్యవస్థ చాలా కీలకమైనదని, జగన్ ఎంతో నమ్మకంతో ఈ వ్యవస్థను తీసుకు వచ్చాకరని, వైఎస్సార్ కాంగ్రెస పార్టీ కార్యకర్తల కంటె వాలంటీర్ల మీదనే ఆయనకు ఎక్కువగా నమ్మకం ఉన్నదని మంత్రి పినిపె విశ్వరూప్ అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా.. వాలంటీర్లు అందరూ వైసీపీని గెలిపించడానికి పనిచేయాలని కూడా ఆయన చెబుతున్నారు. అంతటితో ఆగడం లేదు. ఇతర పార్టీలకు ఎవరైనా వాలంటీర్లు సహకరిస్తుంటే గనుక.. వారిని తక్షణం ఆ ఉద్యోగాల నుంచి తొలగించాలని కూడా సెలవిస్తున్నారు.
వాలంటీర్లు అంటే పార్టీ కార్యకర్తలే అనే అర్థంతో నాయకులు మాట్లాడడం ఇది తొలిసారేం కాదు. అటు ధర్మాన నుంచి, ఇటు పెద్దిరెడ్డి వరకు మంత్రులు, నాయకులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా వాలంటీర్లతో సమావేశం పెట్టుకున్న ప్రతిసారీ.. జగనన్న గెలిపించాల్సిన బాధ్యతను వారే తీసుకోవాలనే అంటున్నారు. జగనన్న రుణం తీర్చుకోవాలని వారికి సెలవిస్తున్నారు. జగన్ ఓడిపోతే సంక్షేమ పథకాలు ఏవీ అందవు అనే భయాన్ని ప్రజల్లోకి వ్యాప్తి చేయడానికి, వాలంటీర్లను వాడుకుంటున్నారు. అదే సమయంలో.. జగన్ ఓడిపోతే.. వలంటీర్ల వ్యవస్థ కూడా ఉండదని, వారి ఉద్యోగాలన్నీ పోతాయని కూడా భయపెడుతున్నారు. ఇన్ని రకాలుగా వారిని ప్రభావితం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పినిపె విశ్వరూప్ మాటలు ఇంకా ప్రమాదకరంగా ఉన్నాయి. ఇతర పార్టీలకు సహకరిస్తే చాలు.. వారిని ఉద్యగాలనుంచి తొలగించేయాలని పినిపె అంటున్నారు. సహకరించడం అంటే ఏమిటి? ఈ మాటల ద్వారా, ప్రభుత్వ పథకాలు ఇతర పార్టీల వారికి అసలు దక్కకుండా చేయాలని అనుకుంటున్నారా? లేదా వాలంటీర్లను మరింత భయంలోకి నెట్టి, వారిద్వారా ఇంకా గట్టిగా పార్టీ ప్రచారం చేయించాలని అనుకుంటున్నారా అర్థం కావడం లేదు.