వారి అర్హతలేమిటో ఎవ్వరికీ తెలియదు.. ఏం పనిచేస్తారో అంతకంటె తెలియదు.. కానీ సర్కారు వారినుంచి నెలవారీ వేతనాలు పుచ్చుకుంటూ ఉంటారు! ఏదో పూటగడవడానికి కాసింత బత్తెం లాంటిది కాదు.. లక్షల్లో జీతాలు పుచ్చుకుంటూ ఉంటారు! వారికి సర్కారీ హోదాల ప్రకారం పెదపెద్ద పోస్టులుంటాయి. కానీ.. వారి సేవలు మాత్రం పెద్దతలకాయలుగా చెలామణీ అయ్యే వ్యక్తులకే పరిమితం అవుతాయి! తమ తమ అనుచరులు, వ్యక్తిగత పనివాళ్లు, సహాయకులు, తైనాతీలకు ఏదో ఒక మేలు చేయాలని ప్రతిఒక్కరూ అనుకుంటారు. అయితే.. తాము అధికారంలో ఉన్నాము గనుక.. వారికి సర్కారు పదవులే కట్టబెట్టి.. ఎడాపెడా దోచిపెట్టేయాలని వైసీపీ పెద్లలు తలపోస్తారు. ఎక్కడో ఒక చోట పోస్టు ఇప్పించి, తమను నమ్ముకున్న వారికి బతుకుతెరువు చూపిస్తే దానిని మానవత్వం అనుకోవచ్చు. కానీ.. లక్షల జీతాలతో అఫీషియల్ పోస్టులు ఇప్పించడం, అనఫీషియల్ గా వారిని తమ పనివాళ్లుగానే వాడుకోవడం అలవాటుగా మారిపోయింది. ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇద్దరూ కూడా.. ఏళ్లసర్వీసు పూర్తిచేసిన తర్వాత తమ వ్యక్తిగత సహాయకులకు ఢిల్లీ ఏపీ భవన్ హోదాలలోని ప్రభుత్వ పదవులకు ఎక్స్‌టెన్షన్ కూడా ఇప్పించడం ఇప్పుడు తాజా వివాదంగా రేగుతోంది.
యథారాజా తథా ప్రజా అని సామెత. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన పనివాళ్లకు తనదైన శైలిలో ప్రత్యుపకారం చేస్తుంటారు. పాదయాత్ర సాగినంతకాలమూ తనకు కాళ్లు పడుతూ ఫిజియో థెరపీ చేసిన గురుమూర్తిని.. సీఎం జగన్ ఏకంగా దేశానికి ఉపయోగపడే చట్టాలు రూపొందించే లోక్ సభకు సభ్యుడిగా పంపేశారు. అర్హతలతో నిమిత్తం లేదు.. తనకు విధేయుడిగా పడిఉండే వ్యక్తి అయితే చాలు.. అనేదే వారి సిద్ధాంతం. ఆయన తన స్థాయిలో చేస్తే.. ఆయన కింద నెంబర్ టూ స్థానాలు నావంటే నావని చెప్పుకుంటూ ఉండే విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మాత్రం తక్కువ తింటారా? తమ రేంజిలో తాము తమ వారికి హోదాలు కట్టబెట్టారు.
ఢిల్లీ ఏపీ భవన్ లో మీడియా విభాగం ఓఎస్డీ అరవింద్ యాదవ్‌కు ఏడాది, స్పెషల్ లైజనింగ్ అధికారి కె.చిన్నప్పన్నకు రెండేళ్లు ప్రభుత్వం పదవులను ఎక్స్‌టెన్షన్ ఇచ్చింది. వీరిద్దరూ ఏపీ భవన్ లో సేవలందించే వాళ్లు కానే కాదు. విజయసాయిరెడ్డికి సహాయకుడు అరవింద్ యాదవ్.. ఆయన సొంత పనులు చూస్తుంటారు. ఆయనకు నెల జీతం లక్ష, ఇంటద్దె మరో అరలక్ష, కారు కోసం మరో అరలక్ష.. ఫోను బత్తెం కూడా కలిపితే.. నెలకు 2.06 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది.
ఈయనతో పోలిస్తే.. పాపం వైవీ సుబ్బారెడ్డి సహాయకుడు, సొంత పనులు చక్కబెట్టే చిన్నప్పన్నకు దక్కేది తక్కువ. ఆయన జీతం 75 వేలే! అలవెన్సులు అన్నీ అదనం. ఆయన సర్వీసును ప్రభుత్వం తాజాగా రెండేళ్లు పొడిగించింది.
ముఖ్యమంత్రి జగన్ అసలు ఏ ఒక్కరి సలహాను చెవిన వేసుకునే రకం కాదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ.. ఆయనను ఆశ్రయించిన వారిలో.. దేహీ మని వచ్చిన వారందరికీ.. నెలకు సుమారు మూడులక్షలరూపాయల పైచిలుకు దక్కేలా.. సలహాదారు పదవుల్ని కట్టబెట్టేయడం.. వారందరూ.. తమ హోదాలను మెడలో తగిలించుకుని.. విలాసంగా తిరుగుతూ ఉండడం అనేది ఒక రివాజుగా మారింది. ఒకవైపు సర్కారుకు నిధులు లేవు.. అంతా అప్పులు అంటూ ఉంటారు.. మరోవైపు.. తమ తమ పనివాళ్లకు సైతం ప్రభుత్వ పదవులు, హోదాలు కట్టబెట్టి.. ఎడాపెడా దోచిపెడుతుంటారు.. దీనిని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలో మరి!