కోరికలు కోరేవారికి హద్దూ అదుపూ ఎందుకు ఉంటుంది? తమకు చిత్తమొచ్చినదల్లా వారు కోరుతారు! కానీ, ఆ కోరికలను తీర్చవలసిన వారే కాస్త ముందూవెనుకా చూసుకుని మాట ఇవ్వాల్సి ఉంటుంది. వరం ప్రసాదించేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయో బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. అలాంటిది కేంద్రంలో, అతి కష్టం మీద తాను ప్రసన్నం చేసుకుంటూ ఉండే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంతో సున్నం పెట్టుకోవడానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు సాహసిస్తారు? అలాంటి పరిస్థితికి దారితీసే వరాన్ని ఆయన ఎందుకు ప్రసాదిస్తారు?
ఈ విషయం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి తెలియనిది కాదు. కానీ భాజపాయేతర పార్టీలు అందరినుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఆయన జగన్మోహన్ రెడ్డిని కూడా ఆశ్రయించాలని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సంకల్పిస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) విషయంలో జగన్మోహన్ రెడ్డి దానిని వ్యతిరేకించాలని ఆయన కోరుతున్నారు. ఏపీ సీఎం ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేస్తామని ఓవైసీ చెబుతున్నారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బిజెపితో సత్సంబంధాలను మాత్రమే కోరుకునే వ్యక్తి. బహిరంగ వేదికల వద్ద మోడీ కనిపిస్తే చాలు, ఆయన తారసపడితే చాలు పాదాలను స్పృశించి ఆశీస్సులు తీసుకోవడానికి జగన్ బహుధా ఆసక్తికనబరుస్తూ ఉంటారు. కేంద్రం ఎలాంటి బిల్లును ప్రవేశపెట్టినా సరే దానికి మద్దతుగా తమ పార్టీ తరఫున ఓటు చేయిస్తూ ఉంటారు. అలాంటిది కేంద్రంలోని బిజెపి తమ సుదీర్ఘకాల ఎజెండాలోని అంశాన్ని ఇప్పుడు బయటకు తీసి.. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు తీసుకువస్తుంటే దాన్ని వ్యతిరేకించడానికి సాహసిస్తారా? సాధ్యమేనా? అనే సందేహాలు ప్రజలలో కలుగుతున్నాయి!
ఉమ్మడి పౌరస్మృతిని భాజపాయేతర పక్షాలలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించే పార్టీలను కూడగట్టడానికి మజ్లిస్ పూనుకుంటోంది. ఇటీవల కెసిఆర్ ను కలిసిన ఓవైసీ వారి మద్దతును పొందగలిగారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కలిసి మద్దతు కోరే ఆలోచన చేస్తున్నారు గాని జగన్ కు అందుకు అంగీకరిస్తారనుకోవడం సందేహమే.
మరొకవైపు మజ్లీస్ పార్టీని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. బెంగుళూరులో జరగబోయే విపక్ష కూటమి సమావేశానికి తమ పార్టీని ఆహ్వానించలేదని మజ్లీస్ ప్రకటించింది. కేసీఆర్ ను కూడా దూరం పెడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆయనతో సఖ్యంగా ఉండడం వలన మజ్లిస్ ను కూడా అనుమానిస్తున్నదా అనే సందేహం పలువురికి కలుగుతోంది.