తెలుగుదేశం నాయకులు అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. సోదర పార్టీ నాయకులు వారిని ఊరడించడానికి వెళుతున్నారు. చంద్రబాబునాయుడు ములాఖత్ కు అనుమతి తీసుకున్నారు. ఇంత చిన్న వ్యవహారంలో రాజకీయ ప్రత్యర్థులు భయపడడానికి ఏముంటుంది? అని ఎవరికైనా అనిపిస్తుంది. అవును నిజమే. ఇందులో భయపడ్డానికి ఏమీలేదు. కానీ ఏమీలేని చోట కూడా భయపడగలగడం అనేది ముఖ్యమంత్రి జగన్ కు మాత్రమే సాధ్యమయ్యే సంగతి. అందుకే ములాకత్ లకు అనుమతిస్తున్నందుకు ఏకంగా జైలు సూపరింటెండెంట్ నే బదిలీచేసేశారు.
తెలుగుదేశం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త శ్రీనివాస్, మామ- మాజీ ఎమ్మెల్సీ అప్పారావు లను చిట్ ఫండ్ కంపెనీకి సంబంధించి అవకతవకలు జరిగాయనే కేసులో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వారు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వారి పరామర్శలకు తెలుగుదేశం నాయకులకు ములాకత్ అనుమతి ఇస్తున్నందుకు గాను.. అక్కడి సూపరింటెండెంట్ రాజారావును అప్రాధాన్యపోస్టుకు ప్రభుత్వం బదిలీ చేసింది.
తెలుగుదేశం నాయకులను ప్రభుత్వం రకరకాలుగా వేధిస్తున్నదని, అనవసరమైన కేసులు పెడుతున్నదని, వారిని ఇరికించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని.. తొలినుంచి రాజకీయ ప్రత్యర్థులనుంచి అనేక విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం సరళి కూడా దానికి తగినట్టుగానే ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన వారి ఆస్తుల మీద దాడులు, వ్యక్తుల మీద దాడులు జరుగుతూనే వచ్చాయి. మార్గదర్శి విషయంలో చందాదారులనుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోయినా సీఐడీ కేసులు పెట్టి వేధిస్తున్నదని విమర్శలు వచ్చాయి. ఆదిరెడ్డి భవానికి చెందిన జగజ్జనని చిట్స్ సంస్థ విషయంలో అలా కాదు. ఫిర్యాదులు కూడా ఉన్నాయి. తమ అరెస్టులను ప్రభుత్వం కావలిస్తే సమర్థించుకోవచ్చు. కానీ.. జైలులో ఉన్నవారిని ములాఖత్ లకు అనుమతించినందుకు అధికారిమీద ఆగ్రహించడం సర్వత్రా విమర్శల పాలవుతోంది.
ఇది తొలిసారి కాదు. గతంలో దేవినేని ఉమా ఇదే జైల్లో ఉన్నప్పుడు కూడా.. ఇదే తరహాలో ములాఖత్ లను అనుమతించినందుకు ఇదే అధికారి రాజారావు మీద బదిలీ వేటు వేశారు. అయితే ఆయన తాను నిబంధనల ప్రకారమే వ్యవహరించానంటూ పోరాడి మరీ తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మళ్లీ అదే భయాన్ని రిపీట్ చేసింది. అరెస్టు అయిన నాయకులతో ఇతర నాయకులు ములాఖత్ అయితేనే ఇబ్బంది వచ్చేస్తుందని ముఖ్యమంత్రి అంతగా ఎందుకు భయపడుతున్నారో అని ప్రజలు అనుకుంటున్నారు.
వారి ‘ములాఖాత్’ అంటే జగన్ కు భయమా?
Saturday, January 18, 2025