పవన్ కళ్యాణ్ తమ పార్టీతో మాత్రమే పొత్తులలో ఉన్నాడు, తమ రెండు పార్టీలు కలిసి మాత్రమే ఏపీలో ఎన్నికలలో పోటీ చేయబోతున్నాయి.. అని ఏపీలోని భారతీయ జనతా పార్టీ పదేపదే చెబుతుంటుంది! ఆ రకమైన మాటలతో పవన్ కళ్యాణ్ ముందరికాళ్ళకు బంధాలు వేయడమే తమ టార్గెట్ అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే అదే భారతీయ జనతా పార్టీ, తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అస్తిత్వాన్ని నామమాత్రంగా కూడా గుర్తించదు. సోదిలోకి కూడా తీసుకోదు. తెలంగాణ బీజేపీ వైఖరిని గమనిస్తే.. జనసేన అనే పార్టీ ఎన్డీఏలో భాగస్వామి కాదేమో, కేవలం ఏపీలో మాత్రమే వారి మధ్య పొత్తులున్నాయేమో అనిపిస్తుంది.
తమకు ఒక్క శాతం ఓటు బ్యాంకుకు కూడా గతి లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ను అడ్డగోలుగా వాడేసుకోవాలని ప్రయత్నిస్తూ.. తమకు అంతో ఇంతో సీట్లు గెలవగల బలం ఉన్నదని అనుకుంటున్న తెలంగాణలో.. అధికారాన్ని పంచుకోవడానికి వీల్లేదు అనే కక్కుర్తి తో పవన్ కళ్యాణ్ ను దూరం పెడుతున్న బిజెపి దుర్మార్గమైన వ్యూహం ఏది. కమలదళం తోకడలను గమనిస్తే పవన్ కళ్యాణ్ జనసేన ను కరివేపాకు లాగా వాడుకుని వదిలేస్తున్నారని అభిప్రాయం మనకు కలుగుతుంది.
తెలంగాణలో తమ విపరీతంగా బలపడిపోయాం అని భారతీయ జనతా పార్టీ ఎంతగానైనా డప్పు కొట్టుకోవచ్చు కానీ.. వాస్తవంలో అంత సీన్ లేదు. వారు ఇప్పుడు పడుతున్న దానికి రెట్టింపు కష్టపడినా సరే మహా అయితే 30 -40 సీట్ల వద్ద ఆగిపోగలరు అనేది విశ్లేషకుల అంచనా! ఇప్పటికిప్పుడు ఏకపక్షంగా బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. అయినా సరే పొత్తు ధర్మం పాటించకుండా, తమ ఎన్డీఏ భాగస్వామి పార్టీని బిజెపి చులకనగా చూస్తున్నదని అభిప్రాయం జనసేన కార్యకర్తలలో కలుగుతుంది. వారికి గతి లేని చోట మనల్ని వాడుకుంటూ, వారికి ఎంతో ఎంతో బలమున్నచోట తీసిపారేస్తున్నారని అంటున్నారు.
నిజానికి తెలంగాణలో కూడా జనసేన పార్టీకి కొంత ఆదరణ ఉంది. పార్టీకి నాయకులు కూడా ఉన్నారు. గత ఎన్నికలలో కూడా పోటీ చేశారు. ఈసారి కూడా పోటీ చేయాలని ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. బిజెపి ఒక మెట్టు తగ్గి పవన్ కళ్యాణ్ తో తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంటే వెనుక.. ఆ పార్టీకి కొన్ని సీట్లు దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సాగించే ప్రచారం భారతీయ జనతా పార్టీకి మరింతగా మేలు చేస్తుంది. అయినా సరే సీట్లు పంచుకోవడం తమకు ఇష్టం లేదు అన్నట్టుగా బిజెపి ఒంటెత్తు పోకడలకు వెళుతుంది. భాగస్వామిని కరివేపాకులా చూసే ఇలాంటి వక్ర బుద్ధి వారికి మేలు చేయదు అని జనసేన నాయకులు అంటున్నారు.