పదుల సంఖ్యలో ఇవే నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ప్రతిసారీ ఏదో కొద్ది చర్చ జరిగింది తప్ప పరువు పోయేంత పరిస్థితి రాలేదు. కానీ ఒకే ఒక్క నిర్ణయం ప్రభుత్వాన్ని పూర్తిగా బజార్లో పెట్టేస్తోంది.వ్యవహారం కోర్టుకు వెళ్లింది. విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది మళ్లీ మళ్లీ వాయిదాలు అడుగుతున్నారు. అయితే తమాషా ఏంటంటే.. వాయిదాలు అడుగుతున్న ప్రతిసారీ.. మరింతగా ప్రభుత్వం పోతోంది. ఎందుకంటే ప్రతిసారీ న్యాయస్థానం.. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం తీరుమీద తీవ్రమైన విమర్శలు, వ్యాఖ్యలు చేస్తోంది.కేసు ఎన్ని ఎక్కువ వాయిదాలు విచారణ జరుగుతోంటే.. అంత ఎక్కువగా ప్రభుత్వం పరువు పోతోంది.
ఏపీ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ ను నియమించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో నలుగుతూ.. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజల్లో మళ్లీ మళ్లీ చర్చనీయాంశం కావడానికి కారణం అవుతోంది. సలహాదారుల నియామకం అనేది ప్రమాదకరంగా మారుతున్నదని, సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా తయారవుతున్నదని కోర్టు మరోమారు దెప్పిపొడిచింది. ‘ఉద్యోగుల సంక్షేమం’ అనే పేరుతో ఒక సలహాదారుని నియమించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తంచేసింది. టీఏ డీఏలు ఇవ్వడానికి కూడా ఒక సలహాదారును పెడతారేమోనని ఎద్దేవా చేసింది.
దేవాదాయ శాఖకు సలహాదారు నియామకం సుదీర్ఘకాలంగా కోర్టులో విచారణలు జరుగుతున్నాయి. విచారణ పూర్తయ్యేవరకు ఆయన పదవిలో కొనసాగవచ్చునని మధ్యలో కోర్టు ఉత్తర్వులు కూడా ఇచ్చింది. అదే సమయంలో సలహాదారుల నియామకం పేరుతో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను పలుమార్లు తప్పుపట్టింది.
జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చిన తర్వాత.. విచ్చలవిడిగా సలహాదారులను నియమిస్తూ పోతున్నారనే విమర్శలు తొలినుంచి ఉన్నాయి. సాధారణంగా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, మంత్రులకు ఇలా పదులసంఖ్యలో సలహాదారులను నియమించారు. అయినా సరే.. దేవాదాయ శాఖకు విడిగా ఒక సలహాదారును నియమించడం కోర్టు దాకా వెళ్లింది. ముఖ్యమంత్రికి సలహాదారులు సరే.. మరీ ప్రభుత్వ శాఖకు కూడా సలహాదారు ఏంటంటూ.. కోర్టు ఆశ్చర్యపోయింది.మరి ఆ శాఖను నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు ఏం చేయాలని ప్రశ్నించింది.
ఒక ఆధ్యాత్మిక స్వామీజీ ఆబ్లిగేషన్ కోసం జ్వాలారపు శ్రీకాంత్ ను సలహాదారు పదవిలో నియమించినట్లుగా అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఆ నిర్ణయం వలన ప్రభుత్వం మళ్లీ మళ్లీ విమర్శలను బహిరంగంగా కోర్టనుంచే ఎదుర్కోవాల్సి వస్తోంది. కోర్టులో విచారణ జరిగిన ప్రతిసారీ, సలహాదారుల పేరుతో లెక్కకు మిక్కిలిగా అయిన వారికి ఆశ్రయం కల్పిస్తున్న సర్కారు తీరు ప్రజల్లో చర్చనీయం అవుతోంది.
వాయిదాలు అడిగేకొద్దీ మరింత పోతున్న పరువు!
Thursday, January 23, 2025