ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే. కానీ చాలా కాలం పాటు ఆ పార్టీ కార్యకర్తలపాలకు దూరంగా ఉండిపోయారు. అవసరమైతే తన నియోజకవర్గంలో పార్టీ అధిష్టానం మరొక ఇన్చార్జిని నియమించవచ్చునని రాజకీయ వైరాగ్యాన్ని కూడా ప్రకటించారు. సాధారణంగా ఇలాంటి అసంతృప్త ధిక్కారస్వరాల పట్ల నిర్లక్ష్యం చూపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను మాత్రం ప్రత్యేకంగా పిలిపించి బుజ్జగించారు. ఆ రోజు నుంచి ఆయన తిరిగి పార్టీ కార్యక్రమాల్లో మమేకం అయ్యారు. కానీ తన అంతరంగంలోని అభిప్రాయాలను మాత్రం దాచుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇష్టపడని తెలిసినప్పటికీ.. రాజధాని విషయంలో అమరావతి కే నా మద్దతు అని తన మనోగతాన్ని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడిస్తున్నారు. ఆయనే మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.
గడపగడపకు కార్యక్రమం మొదలైన చాలా కాలం వరకు దాని మొహం కూడా చూడని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కాస్త ప్రజల్లో తిరుగుతున్నారు. గడపగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇన్నాళ్లు మంత్రి జోగి రమేష్ తో ఉండే విభేదాల కారణంగా సొంత పార్టీకి దూరంగా ఉండిపోయింది ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడడంతో కాస్త మెత్తబడ్డారు. కానీ ప్రజల్లోకి వెళ్లడం అనేది మరోసారి పార్టీ ధోరణుల పట్ల, ఆయన భిన్నాభిప్రాయం వ్యక్తం చేయడానికి కారణమైంది. గడపగడపకు కార్యక్రమంలో ఒక తెలుగుదేశం కార్యకర్త, మీరెందుకు అమరావతి గురించి మాట్లాడడం లేదని ప్రశ్నించినప్పుడు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భిన్నంగా స్పందించారు. వ్యక్తిగతంగా అమరావతి కే నా మద్దతు.. నేను పార్టీ విధానానికి కట్టుబడి ఉండాల్సిందే అని ఆయన అన్నారు. అసలే విశాఖ రాజధాని విషయంలో చాలామొండి గా ఉన్న ముఖ్యమంత్రి జగన్.. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ని ఎలా తీసుకుంటారు తెలియదు.
నిజానికి కొంతకాలం కిందట ఎమ్మెల్యే తండ్రి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు అమరావతి విషయంలో తన అభిప్రా యాలు తీవ్ర స్వరంతో వినిపించారు. తన తండ్రి మాటలు పార్టీలో తనకు ఇబ్బంది కలిగిస్తాయనే భయంతో.. ఆ అభిప్రాయాలు అన్ని ఆయన వ్యక్తిగతం వాటికి నాకు సంబంధం లేదు అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చెప్పుకున్నారు. కొన్నాళ్లు గడిచేసరికి కొడుకు వైఖరిలో కూడా మార్పు వచ్చినట్లు ఉంది.
తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అమరావతికి అనుకూలమే అంటూ ఆయన బయటపడుతున్నారు. ఆయన తరహాలో గుంటూరు, కృష్ణా ప్రకాశం తదితర ప్రాంతాలలోని మరింత మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజధాని వికేంద్రీకరణ పట్ల తమ అసంతృప్తిని రాబోయే కాలంలో బయటపెడతారు చూడాలి. పార్టీ పెద్దలు ఏమనుకుంటారో అనే భయానికి చోటు ఇవ్వని వసంత కృష్ణ ప్రసాద్ ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుందో చూడాలి.