జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ సమాజంలో ప్రజాజీవితాన్ని ఎన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తున్నదో జనసేనాని పవన్ కల్యాణ్ ఎలుగెత్తి చాటేవరకు ప్రపంచానికి తెలియలేదు. ఏదో క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని నేరుగా అందిస్తున్నారు, పెన్షన్లను అందిస్తున్నారు అనే భావనలోనే చాలా మంది ఉన్నారు. మహా అయితే.. జగనన్నకే ఓట్లు వేయాలని, లేకపోతే పెన్షన్లు కూడా ఆగిపోతాయని లబ్దిదారుల్ని బెదిరించే పార్టీ ఏజంట్లుగా పనిచేస్తున్నారని మాత్రమే అనుకుంటున్నారు. కానీ.. వాలంటీర్ల రూపేణా రాష్ట్రప్రజల వ్యక్తిగత వివరాలు సమస్తం ప్రెవేటు వ్యక్తుల చేతుల్లోకి ప్రమాదకరంగా చేరిపోతున్నదని, విమెన్ ట్రాఫికింగ్ కు, రాష్ట్రంలో అమ్మాయిలు, మహిళలు మాయం అయిపోతుండడానికి వాలంటీర్లే కారణంగా నిలుస్తున్నారని తెలిసినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
వాలంటీర్ల ద్వారా జరుగుతున్న బాగోతాలు అన్నీ బయటకు వస్తుండగా.. తమ పార్టీ పరువు పోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ అగ్ర నాయకులు మొత్తం వాలంటీర్లను దారుణంగా వెనకేసుకు వస్తున్నారు. అడ్డగోలుగా వారి చర్యలను సమర్థిస్తున్నారు. అయితే.. విశ్లేషకులు భావిస్తున్నది ఏంటంటే.. ‘వాలంటీర్ల వ్యవస్థ మీద ఈగవాలినాసరే భరించలేని స్థితిలో వైసీపీ పార్టీ ఉంది. వాలంటీర్ల వ్యవస్థ గనుక లేకుండాపోయిందంటే.. ఆ పార్టీకి నడ్డి విరుగుతుంది. పార్టీ మొత్తం కుప్పకూలుతుంది’ అని!
తమాషాగా అనిపించినా ఇది నిజం. వీపు మీద తంతే మూతి పళ్లు రాలాయన్న సామెత చందంగా.. వాలంటీర్ల వ్యవస్థను రద్దుచేస్తే ఒక్కసారిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేకమేడలాగా శిథిలం అయిపోతుంది. ఇలా జరగడానికి సహేతుకమైన కారణాలున్నాయి.
జగన్మోహన్ రెడ్డి వాలంటీరు వ్యవస్థ వచ్చిన తర్వాత.. పార్టీ తరఫు ప్రజల్లో మెలిగే బాధ్యతను మొత్తం వారి భుజాల మీదనే పెట్టేశారు. ప్రభుత్వ కార్యాలయాలతో చిన్నచిన్నపనులు ఉండే ప్రజలు స్థానిక అధికార పార్టీ నాయకులను సంప్రదించడం, వారి ద్వారా తమ పనులు చక్కబెట్టుకోవడం అనే వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. వాలంటీర్లందరూ వైసీపీ కార్యకర్తలే కాబట్టి.. వారి ద్వారానే పనులు జరుగుతున్నాయి. ఇందువలన వైసీపీ లోకల్ లీడర్లకు పబ్లిక్ తో సంబందాలు పూర్తిగా తెగిపోయాయి. వారికి అసలు విలువ లేకుండా పోయింది. దానికి తగ్గట్టుగా జగనన్నకే ఓటు వేయాలి అనే ప్రచార కార్యక్రమాన్ని కూడా చాపకింద నీరులాగా వాలంటీర్లే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థ రద్దయితే గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కుప్పకూలుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ మీద న్యాయపోరాటం చేస్తామని అంటున్న పవన్ కల్యాణ్ ప్రయత్నాల ద్వారా.. ఆ వ్యవస్థ రద్దయితే అధికార పార్టీకి ప్రమాదమే.