యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలు జరగడంలేదని, ఆ దిశగా విద్యావ్యవస్థ కుంటుపడుతోందని ఇప్పటికే అనేక విమర్శలు ప్రభుత్వం మీద వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా కాంట్రాక్టు ఉద్యోగులతోనే యూనివర్సిటీలను నెట్టుకొస్తున్న పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. వారిని పర్మినెంటు చేయడానికే ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ, డొంకదారులు వెతుకుతోంది.
ఇలాంటి నేపథ్యంలో కొత్త నియామకాలు అసలు జరగకుండా మరింత జాప్యం అయ్యేలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆశావహులకు అశనిపాతంగా మారుతోంది. విశ్వవిద్యాలయ అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులను ఆశించే అభ్యర్థులకు ఏపీ కేబినెట్ నిర్ణయం శరాఘాతం లాంటిది. జగన్మోహన్ రెడ్డి ఎవరిని సంతుష్టులను చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు గాని, దాని వలన నిరుద్యోగుల ప్రపంచంలో అసంతృప్తి పెల్లుబికే అవకాశం ఉంది!
విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులకు ఇప్పటిదాకా 62 ఏళ్ల పదవీ విరమణ వయసు అమలువుతోంది. అయితే తాజాగా వీరి విషయంలో క్యాబినెట్ కొత్త నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ చేసిన వారిని కాంట్రాక్టు పద్ధతిలో మరో మూడేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించారు. దీనివలన ముసలితనం పైబడిన తర్వాత కూడా వారు యూనివర్సిటీలలో కొలువులు చేస్తూనే ఉంటారు. పాఠాలు చెప్పడంలో పిల్లలను తీర్చిదిద్దడంలో అది వరకటి శ్రద్ధను అంకిత భావాన్ని ప్రదర్శిస్తారా లేదా అనేది అనుమానమే. ఇలాంటి నిర్ణయం వలన ప్రమాదం ఇదొక్కటి మాత్రమే కాదు.. యూనివర్సిటీ అధ్యాపక ఉద్యోగాలు కోరుకునే ఆశావహులకు అవకాశం దొరకడం అనేది మరింత ఆలస్యం అవుతుంది.
యూనివర్సిటీలలో కూడా ప్రభుత్వం నిధుల కొరతను అధిగమించడానికి వక్రమార్గాలు వెతుకుతున్నదని భావించడానికి ఈ నిర్ణయం దారితీస్తుంది. దానికితోడు కొందరికి లబ్ధి చేకూర్చడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే కొత్త లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తే వారికి యూజీసీ స్కేల్స్ ఇవ్వవలసి వస్తుంది. అదే కాంట్రాక్టు పద్ధతిలో రిటైర్ అయిన వారిని మూడేళ్లు కొనసాగించడం వలన వారికి తక్కువ జీతాలు ఇచ్చినా సరిపోతుంది. వారు అటు పెన్షన్‌తో పాటు ఇటు కాంట్రాక్టు ఉద్యోగులుగా కూడా ఇబ్బడిముబ్బడిగా వేతనాలు పొందుతూ లాభపడుతుంటారు. మరోవైపు నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివి, పీహెచ్డీలుచేసి తమకు ఎప్పుడు అవకాశం దక్కుతుందా అని ఎదురుతెన్నులు చూస్తూనే ఉంటారు. ఈ విషయంలో సర్కార్ నిర్ణయం పట్ల ఆశావహుల్లో సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నిరుద్యోగుల కన్నీళ్లను తుడవడానికి జగన్ ఏం చేస్తారో చూడాలి.