ఉద్యోగుల విషయంలో జగన్ సర్కారు ధోరణి మారడం లేదు. వాళ్లు ఉద్యోగులకు వరాలు ఇచ్చినట్లుగానే బిల్డప్ ఇస్తారు కానీ, అందులో వారికి ఒనగూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువగా ఉంటోంది! ఆశించిన దానికి- పొందుతున్న దానికి పొంతన లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రకటించే వరాలు ఉద్యోగులను వేదనకు గురి చేస్తున్నాయి. ఇందుకు అనేక దృష్టాంతాలు ఉన్నప్పటికీ, తాజాగా కాంట్రాక్టు ఉద్యోగులుగా సేవలు అందిస్తున్న వారిని రెగ్యులరైజ్ చేసే విషయంలో ప్రభుత్వ ధోరణి విమర్శలకు గురవుతోంది.
ఉద్యోగ సంఘాల నాయకులతో జరిపిన చర్చలలో జగన్ సర్కారు వారికి ఇచ్చిన స్పష్టమైన హామీ, వరం ఒకే ఒక్కటి. అది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం మాత్రమే. కొత్త పిఆర్సి ఏర్పాటు చేస్తాం అనడం, కొత్త పెన్షన్ స్కీమును తీసుకువస్తామనడం స్పష్టత లేని/ ఊరట నివ్వని అంశాలు!
అయితే ఉద్యోగుల క్రమబద్ధీకరణ విషయంలో కూడా మడత పేచీలు వారిని ఆవేదన పాల్జేస్తున్నాయి. జగన్ ఎన్నికలకు ముందు ప్రకటించిన వరాలను గుర్తు చేసుకుని తమ జీవితాలు స్థిరపడతాయని భావిస్తూ వస్తున్న వేలాది మంది యువతరం ఇప్పుడు కుమిలిపోతున్నారు. జగన్ విధించిన నిబంధనే అందుకు కారణం. 2014 జూన్ రెండవ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరిస్తామని ఉద్యోగ సంఘాలతో భేటీలో మంత్రులు ప్రకటించారు. ఈ నిబంధన వేల మందికి అశనిపాతంలా మారింది. అన్ని శాఖలలో కలిపి సుమారు 60–70 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా.. ప్రభుత్వ నిబంధన ప్రకారం ఏడువేల కంటే ఎక్కువ మందికి క్రమబద్ధీకరణ జరిగే అవకాశం లేదు.
అదే తెలంగాణ విషయంలో గమనిస్తే రాష్ట్ర విభజన తేదీ నాటికి సర్వీసులో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులు అందరినీ కూడా కేసీఆర్ సర్కారు క్రమబద్ధీకరించింది. ఆ తేదీ నాటితే ఐదేళ్ల సర్వీసు పూర్తయి ఉండాలని నిబంధన జగన్ తెచ్చారు. విభజన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగాలు పొందిన వారు గరిష్టంగా తెలుగుదేశం అనుయాయులు, కార్యకర్తలు అయి ఉంటారని అనుమానం ఉంటే కనుక ఆ తర్వాతి వాటికి ఆపి ఉండవచ్చు కానీ విభజన నాటికి సేవలో ఉన్న అందరినీ రెగ్యులరైజ్ చేసి ఉంటే బాగుండేది. ఆరోజు నాటికి ఉండాలని తో వడపోత జరిగితే వేలాది మంది అన్యాయానికి గురవుతారు అని ఆవేదన చెందుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పేదొకటి అధికారం దక్కిన తర్వాత ఆచరణలో చేసేదొకటి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఒప్పంద ఉద్యోగుల నుంచి వెల్లువెత్తుతున్నాయి. జగన్ చెప్పినట్లుగా పాత పెన్షన్ విధానాన్ని యధాతధంగా తిరిగి అమల్లోకి తీసుకురాకపోతే ఉద్యోగం సంఘాలు మరొకసారి ఉద్యమ బాట పట్టే అవకాశం ఉంది. ఒక సరికొత్త పెన్షన్ విధానం తెస్తాం అంటూ మాయ మాటలతో ఎక్కువ రోజులు పాటు ప్రజలను మోసగించడం సాధ్యంకాని పని.