తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, వచ్చే ఏడాదిలో తాను చేపట్టబోతున్న పాదయాత్ర గురించి అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే లోకేష్ పాదయాత్రకు సంబంధించి అనధికారికంగా కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి. జనవరి 277వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర ఉంటుందని వార్తలు వచ్పాయి. అయితే తాజాగా తన సొంత నియోజకవర్గం మంగళగిరి నేతలతో నిర్వహించిన సమావేశంలో నారా లోకేష్ మరికొన్ని వివరాలు వెల్లడించారు. ఈ దెబ్బతో ఈ దేశంలో పాదయాత్రలకు సంబంధించిన రికార్డులన్నీ తుడిచిపెట్టేయాలని నారా లోకేష్ సంకల్పించినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటిదాకా తమ నాయకుడు చేపట్టినదే దేశంలో అతిపెద్ద పాదయాత్ర అని డప్పు కొట్టుకుంటున్న జగన్ దళాలకు ఇది షాకే! జగన్ పాదయాత్ర రికార్డు, నారా లోకేష్ దెబ్బకు మట్టిగొట్టకుపోతుంది.
తన పాదయాత్ర 400 రోజుల పాటు నిరాటంకంగా కొనసాగుతుందని లోకేష్ చెప్పారు. మొత్తం 4000 కిలోమీటర్లు ఆయన నదవనున్నారు. రాష్ట్రమంతా కవర్ చేస్తారు. పాదయాత్ర పూర్తయ్యేదాకా నియోజకవర్గానికి అందుబాటులో ఉండలేను కాబట్టి పార్టీనేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నారాలోకేష్ సంకల్పించినది చాలా పెద్ద ప్రయత్నమే అని చెప్పాలి. ఎందుకంటే 2023 జనవరిలో ఆయన యాత్ర ప్రారంభిస్తున్నారు. 400 రోజుల పాటు అంటే.. ఏకంగా 2024 మార్చినెలవరకు అది సాగుతుంది.. అది కూడా మధ్యలో ఎలాంటి ఇతర అవాంతరాలు రాకుంటే మాత్రమే! అప్పటికి ఎన్నికలు ముంచుకువచ్చేసి ఉంటాయి. అంటే పార్టీ వ్యవహారాలు మొత్తం చంద్రబాబునాయుడు చూసుకుంటూ ఉండగా, లోకేష్ మాత్రం.. పాదయాత్రలో ప్రజలను కలుస్తూ వారి కష్టాలు తెలుసుకుంటూ, తమ పార్టీ ఏం చేయగలదో నమ్మకం కలిగిస్తూ వెళతారన్నమాట. నిజంగా నాలుగువేల కిలోమీటర్లు అనేది చాలా పెద్ద పాదయాత్రగా పరిగణించాలి.
అందరి రికార్డులు ఇక గల్లంతే
2004లో అధికారంలోకి రావడానికి ముందు.. వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్వహించిన పాదయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని చాలా ప్రాంతాలను కవర్ చేస్తూ 1475 కిలోమీటర్ల దూరం సాగింది. ఆ రికార్డును బద్దలు కొడుతూ 2013లో చంద్రబాబునాయుడు సాగించిన పాదయాత్ర ఏకంగా 2817 కిలోమీటర్ల దూరం సాగింది. ఆయన 208 రోజులు పాదయాత్రలో పాల్గొన్నారు. 2014లో అధికారం దక్కించుకోలేకపోయిన జగన్ 2017 నవంబరు నుంచి 2019 జనవరి వరకు 317 రోజులపాటు ఏకంగా 3648 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించారు. ఈ దేశంలో ఇప్పటిదాకా జగన్ చేపట్టినదే అతిపెద్ద పాదయాత్ర అని వైసీపీ వర్గాలు చెప్పుకుంటూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఆ రికార్డులు అన్నిటినీ నారా లోకేష్ బద్ధలు కొట్టేయబోతున్నారు. ఆయన పాదయాత్ర 400 రోజుల పాటు, 4000 కిలోమీటర్ల దూరం సాగుతుంది. ఇప్పట్లో ఈ రికార్డును బద్దలు కొట్టే మరో నాయకుడు రావడం కూడా కష్టమే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.