లోకేష్ ‘యువగళం’ : పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

Sunday, January 11, 2026

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న రాష్ట్రవ్యాప్త పాదయాత్ర రెండురోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రకు సుదీర్ఘ సస్పెన్స్ తర్వాత పోలీసులు ఎట్టకేలకు అనుమతులు ఇచ్చారు. అయితే యాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకోకుండా అనేక నిబంధనలు కూడా విధించారు. నిబంధనలు విధించడం ఓకే. కానీ.. అనుకోని పరిణామాలు జరగకుండా.. పోలీసులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతోను, అల్లర్లు జరుగుతాయనే అనుమానంతోను పోలీసులు లోకేష్ పాదయాత్రకు చాలా నిబంధనలు విధించారు. ఒక రకంగా చెప్పాలంటే.. ‘ప్రస్తుతానికి మాత్రమే’ అన్నట్టుగా పాదయాత్రను మూడురోజులకు పరిమితంగా అనుమతించిన పోలీసులు ఆంక్షలు మాత్రం సవాలక్ష నివేదించారు. ప్రభుత్వ ప్రెవేటు ఆస్తులకు నష్టం కలగకుండా విధ్వంసం జరగకుండా చూసుకోవాలన్నారు. అలాగే, యాత్రలో రద్దీ నియంత్రణ, భద్రత, సమూహ నియంత్రణ వంటి పనులకు నిర్వాహకులే పురుష, మహిళా వాలంటీర్లను కూడా ఏర్పాటు చేసుకోవాలని నిబంధన విధించారు. ఒక రకంగా చూసినప్పుడు పోలీసులు చెప్పిన ఆంక్షలన్నీ తూచా తప్పకుండా పాటించేట్లయితే పాదయాత్రలో అడుగు తీసి అడుగు వేయడం కూడా గగనం అయిపోతుందని అనిపిస్తుంది. ఈ నిబంధనలు, ఆంక్షలు అన్నింటికీ భద్రత ముసుగు వేశారు గనుక ఒప్పుకోక తప్పదు.
అదే సమయంలో.. పోలీసులు చెబుతున్నట్లుగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులది మాత్రమే కాదు. ఈ ఆంక్షల్లో పేర్కొనడం ద్వారా.. పూర్తిగా వారి మీదకు నెట్టేయడం కుదరదు. పోలీసుల మీద కూడా బాధ్యత ఉంటుంది. ఆస్తుల విధ్వంసం అనే మాట చెబుతుండగా.. ఈ పాదయాత్రలోకి ఎవరైనా రాజకీయ ప్రత్యర్థుల కిరాయి మనుషులు చొరబడి.. ఏదైనా అల్లర్లకు, విధ్వంసాలకు పాల్పడే ప్రమాదం పుష్కలంగా ఉంటుంది. దానిని నిర్వాహకుల మీదకు నెట్టేస్తే కుదరదు. పోలీసులు కూడా తగినంత అప్రమత్తంగా ఉండాలి.
నిర్వాహకులు సభలను, యాత్రను వీడియో తీసి ఒక కాపీ తమకు ఇవ్వాలని కోరుతున్నారు. అదే సమయంలో పోలీసులు కూడా వీడియో తీయించే ప్రయత్నం చేయాలి. డ్రోన్ వీడియోతో యాత్ర పరిసరాల్లోనూ ప్రజల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలి. కనీసం ఆ మాత్రం బాధ్యత తీసుకోకపోతే.. పోలీసు యంత్రాంగం అనే పదానికే విలువ ఉండదు. కాబట్టి నిర్వాహకులకు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే.. పోలీసులు కూడా తగుమాత్రం జాగ్రత్తలు తీసుకుంటేనే యాత్ర లో దుష్పరిణామాలు రేగకుండా ఉంటాయని పలువురు భావిస్తున్నారు.

No tags for this post.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles