తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోతున్న పాదయాత్రకు పేరును పార్టీ ఖరారు చేసింది. ‘యువగళం’ అనే స్ఫూర్తిదాయకమైన పేరుతో యాత్ర నిర్వహించాలని సంకల్పించింది. ప్రభుత్వ అరాచకాల్ని ప్రజల మధ్యనుంచి గొంతెత్తి ప్రశ్నించే గళమిది. ప్రభుత్వం చేస్తున్న దోపిడీలు, దందాల గురించి ప్రజలను చైతన్య పరుస్తూ వారిని మేల్కొలిపే జాగృతగళమిది. తెలుగుదేశం పార్టీలోని యువతరం కడలితరంగంలాగా వెంట కదలిరాగా.. నిరంతరాయంగా నాలుగువందల రోజుల పాటు, నాలుగువేల కిలోమీటర్ల పొడవున ప్రభుత్వాన్ని నిలదీస్తూ అవిరళ ప్రవాహంలాగా సాగే గళమిది. అందుకే ఈ ‘యువగళం’ ప్రభుత్వం పాలిట గొంతులో గరళం అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.
నారాలోకేష్ నిర్వహించదలచుకున్న పాదయాత్ర రూట్ మ్యాప్ ఇంకా ఖరారు కాలేదు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు అనే సంగతి మాత్రం తేలింది. అయితే రూట్ మ్యాప్ తుదిరూపుపై ఇంకా కసరత్తు జరుగుతోంది. వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాలను, కేవలం హైవేలు మాత్రమే కాకుండా వీలైనన్ని ఎక్కువ గ్రామాలను, నిమ్నవర్గాల ప్రజలు జీవించే ప్రాంతాలను అనుసంధానంచేసేలా రూట్ మ్యాప్ ఉండాలని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల ప్రజల సమస్యలను కూడా లోకేష్ సేకరించుకున్నారు. వాటిమీద ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిలదీయడంగా యాత్ర సాగుతుంది.
ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమం తోటే అధికార పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాము అదేపనిగా సంక్షేమం పేరుతో డప్పు కొట్టుకుంటున్నప్పటికీ.. తెలుగుదేశం నిర్వహిస్తున్న కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు స్పందిస్తుండడం గమనించి నివ్వెరపోతోంది. ఆ కార్యక్రమానికి స్పందించి తమ సమస్యలు చెప్పుకున్న వారిని టార్గెట్ చేస్తోంది. విపరీతమైన అసహనానికి గురవుతున్న అధికార పార్టీ.. తెలుగుదేశం వారిపై దాడులకు తెగబడుతున్న సంఘటనలు మనం ప్రతిచోటా గమనిస్తూనే ఉన్నాం. అయితే ఇదే సమయంలో నారా లోకేష్ ‘యువగళం’ ఒక కడలితరంగంలా ప్రభుత్వంపై పోటెత్తనుంది. ఇంకా తేదీలు ఖరారుకాకపోయినప్పటికీ.. ఒకటిరెండు నెలల్లోనే పవన్ కల్యాణ్ వారాహి వాహన యాత్ర కూడా రాష్ట్రవ్యాప్తంగా సాగుతుంది. మరి ప్రభుత్వం, పాలకపక్షం వీటికి ఎలా తట్టుకుంటుందో, ఎలా స్పందిస్తుందో చూడాలి.