లోకేష్ యువగళం : ఎన్ని బ్రేకులు వేస్తారో?

Wednesday, January 22, 2025

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర మరో వారం రోజుల్లో మొదలు కాబోతోంది. ఈనెల 27న కుప్పంలో యాత్రను ప్రారంభిస్తున్నారు. మధ్యలో విరామం లేకుండా 4000 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయాలని సంకల్పించారు. అయితే ఇప్పటిదాకా పోలీసుల నుంచి పాదయాత్రకు అనుమతులు మాత్రం రాలేదు. అనుమతులు ఇచ్చినా సరే.. పాదయాత్ర నిరాటంకంగా సాగకుండా పోలీసులు మధ్యలో ఎన్నెన్ని విఘ్నాలు సృష్టిస్తారో అనే చర్చ పార్టీ వర్గాల్లో ఉంది.
నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి అనుమతుల కోసం ఈనెల 9 వ తేదీనే రాఫ్ట్ర డీజీపీకి తెలుగుదేశం పార్టీ లేఖ ఇచ్చింది. అయితే వారం రోజులు గడచిపోయినా డీజీపీ కార్యాలయం నుంచి స్పందన లేదు. డీజీపీ ఆఫీసులో లేఖ ఇచ్చినా సరే.. యాత్ర సాగుతున్న క్రమంలో స్థానికంగా ఆయా జిల్లాల ఎస్పీలనుంచి కూడా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ మేరకు చిత్తూరు ఎస్పీ, స్థానిక డీఎస్పీలకు కూడా అనుమతుల కోసం లేఖలిచ్చారు. వారినుంచి మాత్రం ఇప్పటిదాకా స్పందన లేదు. అనుమతి తిరస్కరించడం కూడా జరగలేదు.

అయితే జీవోనెం.1 వచ్చిన తర్వాత.. కుప్పంలో లోకల్ ఎమ్మెల్యే హోదాలో పర్యటించడానికి చంద్రబాబునాయుడునే అనుమతించకుండా అడ్డుకున్న పోలీసులు, నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు ఏ రకంగా సహకరిస్తారు.. అనేది కూడా చర్చనీయాంశమే అవుతోంది.
నారా లోకేష్ పాదయాత్ర విషయంలో జగన్ సర్కారుకు భయం చాలా ఉన్నదని అభిజ్ఞవర్గాలు చెబుతున్నాయి. పాదయాత్ర అనేది అధికారానికి ఒక సెంటిమెంట్ దారిగా మన రాష్ట్రంలో మారిపోయిందని ప్రజలు అంటున్నారు. లోకేష్ ప్రతిరోజూ ప్రజలతో మమేకం అవుతూ ప్రభుత్వం గురించి విమర్శలు చేస్తూ, ప్రజలకు వాగ్దానాలు చేస్తూ ఉంటే దాని ప్రభావం ఎంతోకొంత ఉంటుందనేది వారి అభిప్రాయం. అలాగే ప్రధానంగా నారా లోకేష్ ఈ పాదయాత్ర పూర్తి చేస్తే గనుక.. జగన్మోహన్ రెడ్డి పేరిట ఉన్న అతి సుదీర్ఘమైన పాదయాత్ర రికార్డు బద్దలవుతుంది. తన రికార్డు బద్ధలు కావడాన్ని జగన్ సహిస్తారా? అనే అభిప్రాయం కూడా పలువురిలో ఉంది.
అందుకే ఏదో ఒక మిష మీద నారా లోకేష్ పాదయాత్రకు బ్రేకులు వేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉంటుందని.. తొలుత అనుమతి వచ్చినప్పటికీ ఎక్కడికక్కడ బ్రేకులు వేయడానికి వారు చూస్తారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు లోకేష్ పాదయాత్ర అంటూ మొదలెడితే.. ప్రతి ఊరిలోనూ వెల్లువలా జనం వస్తారు. అయితే జనం పరంగా నియంత్రణలు, నిబంధనలు విధిస్తూ.. ఇంతమందికి మించి ఉండడానికి లేదని అంటూ.. ఆంక్షలు పెట్టే ప్రమాదమూ ఉంది. ఎలా వీలైతే అలా నారా లోకేష్ యాత్రకు బ్రేకులు వేయడానికి ప్రభుత్వం కొత్త దారులు వెతుకుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles