లోకేష్ పాదయాత్ర స్కెచ్ రెడీ! వాళ్లు రెడీనా?

Saturday, September 7, 2024

నారా లోకేష్ సరిగ్గా ఇంకో నెలరోజుల్లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. ఆయన పాదయాత్రకు రూట్ మ్యాప్ కూడా సిద్ధమైంది. కుప్పంనుంచి ఇచ్ఛాపురం వరకు అనేది ఇదివరకే ప్రకటించారు. కాకపోతే.. ఏయే నియోజకవర్గాల మీదుగా ఏయే రోజుల్లో ఎంతెంత దూరం యాత్ర సాగుతుందనే వివరాలు మొత్తం అచ్చెన్నాయుడు ప్రకటించబోతున్నారు. అంటే పాదయాత్రకు రంగం మొత్తం సిద్ధం అయినట్లే. నాలుగువేల కిలోమీటర్ల పాదయాత్ర ద్వారా.. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర రికార్డులను కూడా తుత్తునియలు చేస్తూ.. సరికొత్త ప్రజా నాయకుడిగా అవతరించడానికి లోకేష్ ఉత్సాహంగానే ఉన్నారు. మరి, ఈ పాదయాత్ర ఉధృతిని ఎదుర్కోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ కూడా తయారుగా ఉన్నదా? అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.
లోకేష్ పాదయాత్ర చేయాలనే ఆలోచన ఇవాళ్టిది కాదు. రెండేళ్ల ముందునుంచి పార్టీలో బలంగా ఉంది. అయితే సరైన ముహూర్తం కోసమే ఆగుతూ వచ్చారు. తీరా ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు ముగిసేలాగా 400 రోజుల పాదయాత్ర చేయబోతున్నారు. పాదయాత్ర చేయాలనే ఆలోచన వచ్చినప్పటినుంచి లోకేష్ దానికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగా ఆయన ఫిట్ నెస్ మీద శ్రద్ధ పెట్టారు. తన శరీర బరువును బాగా తగ్గించారు. డైట్, వ్యాయామ నియమాలు పాటిస్తూ శారీరక దార్ఢ్యం పరంగా ఫిట్ గా తయారయ్యారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పాదయాత్రలో ప్రభుత్వం మీద ఎలాంటి విమర్శల దాడితో వారిని ఉక్కిరిబిక్కిరి చేయాలి అనే కోణంలోంచి కూడా ఆయన చాలా తీవ్రమైన కసరత్తు చేశారు.
పాదయాత్ర అనుకున్న నాటినుంచి.. దానిని కుప్పంనుంచే ప్రారంభించాలనే ఆలోచన వారిలో ఉంది. దానికి తగ్గట్టుగానే.. అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను సేకరించుకున్నారు. వాటితో డీటెయిల్డ్ నోట్స్ తయారుచేసుకున్నట్లు సమాచారం. స్థానికంగా ప్రజల సమస్యలు, వాటికి మళ్లీ తమ ప్రభుత్వం వస్తే చేయగల పరిష్కారాలు సమస్తం ప్రజలకు చెప్పేలాగానే ఆయన పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రజల వెంట ఉండి, వారి కష్టాలు తొలగించడానికి, అసలైన అభివృద్ధి అంటే ఏమిటో రుచిచూపించడానికి తెలుగుదేశం ఒక్కటే సరైన ప్రత్యామ్నాయం అని నిరూపించే ప్రణాళికతో వెళుతున్నారు.
దానితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ నాయకుల అక్రమాలు, అరాచకాలు, దందాలు ఇవన్నీ కూడా నియోజకవర్గాల వారీగా వివరాలు సేకరించి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. స్థానికంగా ప్రతిచోటా అక్కడి అధికార పార్టీ నాయకుల అక్రమాలను ప్రశ్నించడం ద్వారా ప్రజలను ఆలోచింపజేయాలనేది లోకేష్ ఆలోచనగా కనిపిస్తోంది. ఆ రకంగా చూసినప్పుడు పాదయాత్రకు అన్ని రకాలుగానూ ఆయన సిద్ధంగానే ఉన్నారు. మరి ఆయన విమర్శలను తట్టుకోవడానికి, వాటికి జవాబు చెప్పడానికి వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు కూడా సిద్ధంగా ఉన్నారా? అనే ప్రశ్న ప్రజల్లో కలుగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles