లోకేష్ పాదయాత్రకు ఆటంకాలు పిరికితనం అవదా?

Saturday, November 16, 2024

నారాలోకేష్ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు సృష్టించినట్లయితే.. అది పిరికితనం అనిపించుకుంటుంది కదా? నారా లోకేష్ ప్రజల్లోకి వెళుతున్నారంటే, ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే.. ఆ మాటలతో ప్రజలు ప్రభావితం అవుతారని, అంతిమంగా ప్రభుత్వానికి చేటు జరుగుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భయపడినట్టు అవుతుంది కదా అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయవర్గాల్లో ముమ్మరంగా నడుస్తోంది. లోకేష్ పాదయాత్ర నిరాటంకంగా సాగడానికి అనుమతులు వస్తాయా? లేదా? అనే చర్చ ఇప్పుడు ప్రజల్లో సైతం సాగుతోంది.
సరిగ్గా పదిరోజుల్లో నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెల 27న కుప్పంలో ఆలయం, మసీదుల్లో పూజా కార్యక్రమాలు, ప్రార్ధనలు నిర్వహించి సుమారు నాలుగువేల కిలోమీటర్ల మేర నడిచే నారా లోకేష్ పాదయాత్రకు శ్రీకారం చుట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. చాలాకాలం ముందునుంచే దీనికి సంబంధించిన ప్రణాళికను ప్రకటించారు. సన్నాహాలు చేసుకున్నారు. ఈలోగా ప్రభుత్వం జీవోనెం.1 తీసుకువచ్చింది. దీనిద్వారా లోకేష్ పాదయాత్రకు కూడా అడ్డంకులు సృష్టిస్తారనే అనుమానాలు పలువురికి కలిగాయి. ఆ జీవో ప్రస్తుతం సస్పెండ్ అయినప్పటికీ.. తెలుగుదేశం నాయకుల కార్యక్రమాలకు ప్రతిచోటా అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి.
తొలివిడతగా మూడు జిల్లాల్లో యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ తో సహా నారాలోకేష్ తరఫున తెలుగుదేశం పార్టీ పోలీసులకు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇప్పటిదాకా అటువైపునుంచి రెస్పాన్స్ లేదు. మరోవైపు పాదయాత్రకు గడువు దగ్గరపడుతుండగా.. పార్టీ మాత్రం తతిమ్మా ఏర్పాట్లు చేసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలో అనుమతులు వస్తాయా లేదా అనే అనుమానాలు పుడుతున్నాయి. పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలుగుదేశం హెచ్చరిస్తోంది.
అనుమతించకపోతే గనుక.. మహాత్మాగాంధీ ఉప్పు సత్యాగ్రహం సమయంలో చూపించిన ధిక్కార బాటనే అనుసరిస్తాం అని తెదేపా నేత పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. చట్టాన్ని ధిక్కరిస్తామని, జైల్ భరోలు చేపడతామని అంటున్నారు. మరోవైపు చంద్రబాబునాయుడు పాలనలో జగన్మోహన్ రెడ్డి స్వేచ్ఛగా నిరాటంకంగా పాదయాత్ర చేసుకోగలిగినప్పుడు.. ఆయన పాలనలో నారా లోకేష్ పాదయాత్రకు అనుమతించకపోతే పరువు పోతుంది కదా అనే ఆలోచన వైసీపీ వర్గాల్లో కూడా ఉంది. లోకేష్ యాత్రకు ఆటంకాలు కలిగిస్తే.. ప్రభుత్వానికి పరువునష్టం అని, ప్రజలు తమను దుర్మార్గులుగా భావించే అవకాశం ఉన్నదని వారు తలపోస్తున్నారు. మరి పోలీసుల వైపునుంచి ఎలాంటి స్పందన వస్తుందో, ఎన్నెన్ని నిబంధనల ఆంక్షలతో అనుమతి వస్తుందో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles