లూప్‌లైన్‌లోకి బండి.. కిషన్ చేతికి పగ్గాలు!

Tuesday, November 5, 2024

తెలంగాణ భారతీయ జనతా పార్టీకి సంబంధించి చాలా రోజులుగా జరుగుతున్న ప్రచారం శుక్రవారం నాటికి తారస్థాయికి చేరుకుంది. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు తథ్యం అనే వార్తలు రాజకీయాలను వేడెక్కించాయి. ఆయన స్థానంలో ఎవరు అనే విషయంలో కిషన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలను ఎవరి చేతిలో పెడతారనే విషయంలో కిషన్ రెడ్డి పేరు అనూహ్యంగా తెరమీదకు వచ్చినదేమీ కాదు. ఇతర పేర్లతో పాటు కొన్ని రోజులుగా చర్చల్లోనే ఉంది. కేంద్రమంత్రి పదవిని వదులుకొని రాష్ట్ర పార్టీ సారథ్యం స్వీకరించడానికి ఆయన విముఖంగా ఉన్నట్లు వార్తలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఒక నాయకుడికి ఒకటే పదవి అనే పార్టీ సిద్ధాంతాన్ని కాస్త పక్కన పెట్టాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు గా కనిపిస్తోంది. బిజెపి అధికారంలో లేని రాష్ట్రాలలో పార్టీ అధ్యక్షుల కార్యక్రమాలకు ప్రోటోకాల్ పరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు వారిని కేంద్ర మంత్రులుగా కూడా కొనసాగించే ఆలోచన ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. అలాంటి లెక్కల ప్రకారం కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవిలో కొనసాగిస్తూనే రాష్ట్ర పార్టీ సారథ్యం అప్పగిస్తారని అనుకుంటున్నారు.

బండి సంజయ్ విషయానికి వస్తే మొన్న మొన్నటిదాకా ఆయనను తప్పించే అవకాశం లేదని ఎన్నికలు పూర్తి అయ్యేదాకా కొనసాగుతారని అందరూ చెబుతూ వచ్చారు. హఠాత్తుగా నాయకత్వం మార్పు నిర్ణయం శుక్రవారం చర్చల్లోకి వచ్చింది. పార్టీ అధ్యక్షుడిగా తప్పిస్తే జాతీయ కమిటీలోకి కీలక స్థానంలోకి తీసుకోవడం గాని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం గాని జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయన మాత్రం సాధారణ కార్యకర్తగానే పార్టీకి సేవలందిస్తానని అంటున్నారు. బండి సంజయ్ పదవి మార్పు పుకార్లు బయటకు వచ్చిన వెంటనే అసమ్మతి గళాలు కూడా మొదలయ్యాయి.

ఈ సమయంలో బండిని పక్కకు తప్పిస్తే పార్టీ నుంచి బయటకు వలస వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందని ఆ నిర్ణయం పార్టీకి ఆత్మహత్యాసదృశ్యం అవుతుందని మాజీ మంత్రి విజయ రామారావు ఒక ట్వీట్ చేశారు. పదవి మార్పు పుకార్లపై బండి సంజయ్ కూడా సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. కెసిఆర్ తో తలపడే బలమైన టీం ను తయారు చేసే క్రమంలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత గందరగోళానికి గురవుతున్నట్లుగా కనిపిస్తోంది.

బండి సంజయ్ గురించి అసమ్మతి నేతలు అధిష్ఠానం వద్ద చేసిన ఫిర్యాదులు పనిచేశాయా? ఆయన పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలు పార్టీని వీడిపోయే అవకాశం లేకుండా పార్టీ చాలా హడావుడిగా ఈ నిర్ణయాలు తీసుకుంటున్నదా అనే చర్చోపచర్చలు జరుగుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles