Rolling stone gathers no mass అని ఇంగ్లిషులో ఒక సామెత ఉంటుంది. తెలుగులో మనం ‘దొర్లుపుచ్చకాయ’ అని అంటూ ఉంటాం. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే అలాగే అనిపిస్తోంది. ఏపీ రాజకీయాల్లో ‘రోలింగ్ స్టోన్’గా వ్యవహరించదగిన నాయకుడు తోట చంద్రశేఖర్ ఇప్పుడు గులాబీ కండువా కప్పుకోబోతున్నారు. కేవలం కండువా మాత్రమే కాదు. బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడుగా కూడా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అయితే ఈ రోలింగ్ స్టోన్ బిఆర్ఎస్ పార్టీని ఏపీలో ఏ శిఖరాలమీదికి తీసుకువెళ్లగలుగుతుంది.
ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న వాళ్లలో నిలకడలేని, పార్టీలు ఫిరాయించడం అనేది అలవాటుగా మార్చుకున్న రాజకీయ నాయకుడు ఎవరా అంటే మనకు చటుక్కున గుర్తుకు రాగల పేరు తోట చంద్రశేఖర్. ముంబాయిలో సేవలందించిన ఈ సివిల్ సర్వీసెస్ అధికారి.. రాజకీయ అధికారమే లక్ష్యంగా రాజీనామా చేసి వచ్చారు.
2009 ఎన్నికల వేళకు ప్రజారాజ్యం పార్టీలో చేరి చిరంజీవి దన్నుతో ఆయన గుంటూరు ఎంపీగా పోటీచేశారు. 2014 వచ్చేసరికి.. అప్పటికి వైఎస్సార్ కాంగ్రెస్ హవా ప్రబలంగానే ఉండడంతో ఆ పార్టీలో చేరి వైసీపీ తరఫున ఏలూరు ఎంపీగా బరిలోకిదిగి ఓడిపోయారు. 2019 నాటికి పవన్ కల్యాణ్ పార్టీ జనసేనలో చేరి గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేశారు. ఎంపీగా పోటీచేస్తున్నప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదని అనుకున్నారేమో గానీ.. ఎమ్మెల్యే బరిలోకి దిగారు. మళ్లీ ఓటమి తప్పలేదు.
జనసేన పార్టీకి కీలక నాయకుల్లో ఒకరుగా ఉన్నారు. జనసేన పార్టీకి కీలక ఆర్థిక వనరుగా కూడా ఉన్నారు. జనసేన కోసం సోషల్ మీడియా సైనికులను జీతాలు ఇచ్చి పోషించిన ట్రాక్ రికార్డు కూడా ఆయనకు ఉంది. అలాగే 99 టీవీ ఛానెల్ ను తన సొంత డబ్బుతో కొనుగోలు చేసి పవన్ కల్యాణ్ ప్రచారానికి కేటాయించారు. పవన్ కల్యాణ్ కు మీడియా దన్ను కోసం ఆ చానెల్ ను కొన్నారు గానీ.. అది కూడా లాభాలపరంగా చేదు ఫలితాలనే రుచిచూపించింది. జనసేన కు అన్ని రకాలుగా అండగా ఉంటూ వచ్చినప్పటికీ.. అన్ని రకాలుగా ఆయన నష్టాలే చవిచూశారు.
ఇప్పుడు కొత్తగా బిఆర్ఎస్ పార్టీ ఏపీలోకి ఎంట్రీ ఇస్తున్న తరుణంలో.. ఏకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేరబోతుండడం విశేషం. రెండు ఎన్నికల వరకు ఒక పార్టీలో ఉండలేకపోయిన ఈ రోలింగ్ స్టోన్ నాయకుడు.. గులాబీ దళానికి ఏపీ సారధిగా ఏం సాధిస్తాడా అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఆయన ప్రధానంగా తన సామాజికవర్గం మీది ప్రేమతో ప్రజారాజ్యం, జనసేన పార్టీల్లో కీలకంగా ఉన్నారు. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే పరిస్థితి మారుతుంది. ఆ పార్టీ తరఫున ఏపీలో 2024లోనైనా విజయాన్ని నమోదు చేస్తారా? సుదీర్ఘ కెరీర్లో ఒక విజయమైన దక్కించుకుంటారా? అనే చర్చ ప్రజల్లోజరుగుతోంది.
‘రోలింగ్ స్టోన్’ నాయకుడు బీఆర్ఎస్‌ను ఏం చేయగలడు?
Saturday, November 16, 2024