ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి సర్కారు వచ్చే ఎన్నికలలో అధికారం రెండోసారి చేపట్టడం తప్ప తమ జీవితాలకు మరో పరమార్ధం అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తోంది. మామూలుగానే ఓటు బ్యాంకు రాజకీయాలకు పెద్దపీట వేసే ఈ రోజులలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ లెక్కలను కొత్త ఎత్తులకు తీసుకు వెళుతోంది. ఓట్లుగా గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంటే తప్ప.. రాష్ట్రంలో ఏ మూలనైనా ఏ చిన్న అభివృద్ధిని కూడా చేపట్టబోం అనే తరహాలో వారి ఎత్తుగడలు ఉంటున్నాయి. చివరికి గోతుల మయంగా మారి ప్రజలకు నరకం చూపిస్తున్న రోడ్లను బాగు చేసే విషయంలో కూడా.. బలమైన ఓటుబ్యాంకున్న ప్రాంతాలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం సంకుచిత ధోరణిని అవలంబిస్తోంది. ‘ఈ రోడ్డును మరమ్మతు చేయకుంటే మన ఓట్లు పోతాయి’ అని ఐపాక్ తరఫున సర్వేలు చేస్తున్న ప్రతినిధులు నివేదికలు అందించిన రోడ్లను మాత్రమే పట్టించుకుంటున్నారు. తతిమ్మా రోడ్లను గాలికి వదిలేస్తున్నారు.
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా కనీవినీ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని.. వచ్చే ఎన్నికల నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం మళ్లీ తమకు దక్కుతుందని.. మహేష్ జగన్మోహన్ రెడ్డి ప్రతి సందర్భంలోనూ ధీమా వ్యక్తం చేస్తుంటారు. అయితే ఆచరణలో మాత్రం ఆయన వేసే అడుగులలో ఎన్నికల పట్ల భయం కనిపిస్తూ ఉంటుంది. కేవలం సంక్షేమ పథకాలు నమ్ముకుంటే ఎదురు దెబ్బ తప్పదనే భయం కూడా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి తాను ప్రధానంగా ఆధారపడే ఐప్యాక్ ప్రతినిధుల నివేదికలు కూడా ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. నరకానికి రహదారులుగా ముద్రపడిన అనేకనేక రోడ్లను తక్షణం బాగు చేయకపోతే గనుక ప్రజలు ఎన్నికలలో గుణపాఠం చెబుతారని ప్రభుత్వానికి అందిన ఐపాక్ నివేదిక.
అందుకే ఇప్పుడు రోడ్ల మరమ్మతులకు సంబంధించి కసరత్తు ప్రారంభిస్తున్నారు.. ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఐదేసి రోడ్లను బాగు చేసేలాగా పనులు చేపట్టాలని అనుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఏయే రోడ్లను రిపేరు చేయాలి అనేది.. ఐ ప్యాక్ చెబుతుంది. ఎక్కువ దెబ్బతిన్న రోడ్లను ముందుగా బాగు చేయడం అనే ప్రాధాన్యాలన్నీ మారిపోయాయి. అధికారులు తమ తమ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు సంబంధించి తయారు చేసిన నివేదికలన్నీ గాలికి కొట్టుకుపోయాయి. కేవలం ఓటుబ్యాంకు నివేదికలను బట్టి మాత్రమే రోడ్లను బాగుచేయాలనే నిర్ణయాలు తీసుకుంటూ ఉండడం ప్రజల్లో విమర్శలకు దారితీస్తోంది.
ప్రజల సమస్యలు తీర్చడం అనేది ప్రాథమిక లక్ష్యం కాకుండా.. ప్రతిపనినీ ఓటు కోణంలో చూడడం అనే పోకడలు ప్రజాస్వామ్యానికి మంచివి కావని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.