రేషన్ బియ్యం ఎత్తేసే యోచనలో ఏపీ సర్కార్?

Thursday, December 19, 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయడాన్ని రద్దు చేయాలని అనుకుంటోందా? ఇప్పటికే అనేక పథకాల విషయంలో ప్రజలకు నేరుగా డబ్బులు చేతికి అందిస్తూ, ధన పంపిణీ ని ఒక అలవాటుగా మార్చిన ప్రభుత్వం.. రేషన్ బియ్యం పంపిణీని కూడా నిలిపివేసి ఆ లబ్ధిని కూడా డబ్బు రూపంలోనే అందించాలని అనుకుంటున్నదా? కాస్త లోతుగా పరిణామాలను గమనిస్తున్న వారికి అలాంటి అనుమానం కలుగుతోంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు చెందిన సాక్షి దినపత్రిక తెలంగాణ ఎడిషన్ లో ఆరాష్ట్రంలో రేషన్ బియ్యం పంపిణీ పరిస్థితుల గురించి ఓ కథనం ప్రచురించింది. ప్రజలు ఎవ్వరూ రేషన్ బియ్యం వాడుకోవడం లేదని, రేషన్ బియ్యం నాణ్యత లేనందువలన వాడడం లేదని అందులో సారాంశం. ప్రభుత్వం దాదాపు కిలోకు 33 రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సరఫరా చేస్తోంటే.. వారు ఇలా తీసుకుని అలా కిలో బియ్యాన్ని రూ.8కే చిరు వ్యాపారులకు అమ్మేస్తున్నారనేది ఆ వార్తాకథనంలోని అసలు కీలక విషయం. రేషన్ బియ్యం ముద్ద అయిపోతోంది గనుక ఎవరూ వాడడం లేదని అంటున్నారు. ఇడ్లీ దోశకు మాత్రం వాడుకుంటున్నారని, మిగిలిన బియ్యాన్ని చవగ్గా అమ్మేస్తున్నారని, మిల్లర్లువాటిని తీసుకుని రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని అందులో రాసుకొచ్చారు.
ఏపీలో ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం కూడా నాణ్యత తక్కువగానే ఉన్నదంటే సాక్షి దినపత్రిక ఒప్పుకోకపోవచ్చు. కానీ.. ఆ వార్తాకథనంలోని సంగతులన్నీ యథాతథంగా ఏపీలో కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఇంటి ముంగిటకు వస్తున్న రేషన్ బియ్యాన్ని వండుకుని తింటున్న వారెవ్వరూ లేరు. తెలంగాణలో కిలో రూ.8 వంతున అమ్ముకుంటున్నారేమో గానీ.. ఏపీ ప్రజలు కిలో రూ.10 వంతున అమ్ముకుంటున్నారు. అంతకుమించి వేరే తేడా ఏమీ లేదు. బియ్యం రేషన్ ద్వారా పుచ్చుకుంటున్న పేదల్లో వాటిని వండుకుని తింటున్న వారు చాలా తక్కువ. దళారీ వ్యవస్థ మాత్రమే వర్ధిల్లుతోంది.
పైగా ప్రతి ఒక్కరికీ డబ్బులు పంచడం అలవాటుగా చేసుకుని, ఏడాదికోమారు మీ ఇంటికి జగనన్న ఇన్ని వేల రూపాయలు, ఇన్ని లక్షల రూపాయలు అప్పనంగా ఇచ్చేవాడు.. మీరంతా రుణపడి ఉండాలి.. ఓటు వేయాలి అని చెప్పడాన్ని అలవాటు చేసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్.. రేషన్ బియ్యం పంపిణీని ఎత్తివేయదలచుకుంటున్నదా? అనే అనుమానం పుడుతోంది. అందుకోసమే ఏపీలో పథకం ఎత్తేయడానికి రంగం సిద్ధం చేస్తూ.. తెలంగాణలో రేషన్ బియ్యం పంపిణీలో లోపాలున్నట్టుగా.. అక్కడి లబ్ధిదారులంతా ప్రభుత్వం బియ్యం బదులుగా డబ్బులే ఇస్తే మేం సుఖపడతాం అంటున్నట్టుగా ఒక కుట్రపూరిత ప్రచారం చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తే.. దాన్ని పదిరూపాయలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే పేదల్లోని ధనవంతులు అనేకమంది ఉండొచ్చు గానీ.. వాస్తవంలో ఆ బియ్యం వస్తే తప్ప అంత గంజికాసుకుని తాగడానికి గతిలేని వారు కూడా చాలా మందే ఉంటారు. పథకం ద్వారా వారికి నిజమైన మేలు జరిగితే చాలు. వారి కడుపులు నిండితే చాలు. వారు ఆకలితో చావకుండా ఉంటే చాలు. బియ్యం బదులుగా డబ్బులు ఇస్తే రకరకాలుగా అది దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంటుంది. పేదలు మరింతగా ఇబ్బందులు పడే ప్రమాదం ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles