రేవంత్ భజనలోనే భవిష్యత్తు.. ఫిక్సయిన కొండా!

Sunday, January 19, 2025

వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఎంతో సాన్నిహిత్యం వున్నది గనుక, కొండా సురేఖ కాస్త వ్యూహాత్మకంగా సరైన సమయం చూసుకొని షర్మిల ప్రారంభించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరుతుందనే ఊహ ఎవరికైనా ఉన్నట్టయితే కనుక అలాంటి ఆలోచనలు వారు మరిచిపోవచ్చు. కొండా కుటుంబం నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కొనసాగబోతున్నారు, వారు ప్రస్తుతం ప్రత్యామ్నాయ ఆలోచనలేవీ చేయడం లేదు. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదనే అసంతృప్తితో, అంటీ ముట్టనట్టుగా మెలగతూ వచ్చిన కొండా దంపతులు, వరంగల్ జిల్లాలో టీపీసీసీ సారధి రేవంత్ రెడ్డి నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా ఒక క్లారిటీ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీని వీడిపోయే ప్రసక్తే లేదని సంకేతాలు పంపారు. నర్మగర్భంగానే తమకు ఏ సీటు కావాలనేది కూడా వారు రేవంత్ రెడ్డి దృష్టికి తెచ్చారు. రేవంత్ రెడ్డి కూడా అదే తరహాలో ప్రతిస్పందించడం విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా పిసిసి సారధి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. యాత్రలో భాగంగా వరంగల్ జిల్లాలో ఆయనతోపాటు కొండా మురళి, సురేఖ దంపతులు కూడా పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ని మనం ముఖ్యమంత్రిగా చూడాలనే అభిలాషను వ్యక్తం చేస్తూ కొండా సురేఖ తన ప్రసంగంలో ఆయనను కీర్తించారు. రేవంత్ రెడ్డికి నైతిక మద్దతుగా ఆమె మాటలు సాగిపోయాయి. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కుట్రపూరితంగా ఇరికించారని.. రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించడానికి కాంగ్రెస్ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని కొండా సురేఖ పిలుపు ఇచ్చారు. అంతటితో ఆగకుండా రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లాకు వచ్చి పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రబెల్లి దయాకర్ రావు మీదనే పోటీ చేయాలని కూడా కొండా సురేఖ ఒక ప్రతిపాదన చేశారు. అదే సమయంలో ఒకవేళ రేవంత్ రెడ్డి పాలకుర్తిలో పోటీ చేయలేకపోతే గనుక.. అక్కడి నుంచి తాము పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కొండా సురేఖ వెల్లడించారు. తద్వారా.. రేవంత్ ప్రతిష్ఠ కోసం తాము త్యాగానికి, సాహసానికి సిద్ధపడుతున్నట్లుగా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఇండైరెక్టుగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం మీద కూడా కొండా కుటుంబం కర్చీఫ్ వేసినట్లుగా కనిపిస్తోంది.

రేవంత్ రెడ్డి మాత్రం తన ప్రసంగంలో కొండా సురేఖ సీటును దాదాపుగా కన్ఫర్మ్ చేసినట్టే అనుకోవాలి. సురేఖను వరంగల్ ఈస్ట్ నుంచి గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నదంటూ ఆమె నియోజకవర్గాన్ని పిసిసి అధ్యక్షుడు తేల్చేశారు. మరి సురేఖ ప్రతిపాదన కూడా కార్యరూపం దాల్చాలంటే.. పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఆమె భర్త కొండా మురళి పోటీ చేయాలని కోరుకుంటున్నారో ఏమో గమనించాల్సి ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles