ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీయే భాగస్వామి పార్టీల భేటీలో ఒక అద్భుతమైన మాట సెలవిచ్చారు. ఎన్డీఏ కూటమితో కలిసి వచ్చే అన్ని పార్టీల కోసం సాదరంగా స్వాగతం పలుకుతున్నామని ఆయన రెడ్ కార్పెట్ పరిచేశారు. రెండోసారి ప్రధాని అయి ప్రభుత్వం ఏర్పాటుచేసిన తర్వాత.. ఈ నాలుగేళ్లలో ఒక్కసారి కూడా భాగస్వామి పార్టీల భేటీ ఏర్పాటుచేసి.. కనీసం వారి అభిప్రాయాలు తెలుసుకోవడం గానీ, పాలనకు సలహాలు అడగడం గానీ చేయని నరేంద్రమోడీ.. ఎన్నికలు ముంచుకువస్తున్నాయనగా.. ఈ భేటీపెట్టి, కూటమినుంచి వెళ్లిపోయిన పార్టీలను కూడా ఆహ్వానించి.. వారితో పాటూ.. తమతో కలిసిరాగల ఏ పార్టీకైనా సరే స్వాగతం అంటూ.. తమకు సిద్ధాంతాలు, భావజాలాల పట్టింపే లేదన్నట్టుగా ఇలా ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానించడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. వచ్చే ఏడాది జరిగే పార్లమెంటు ఎన్నికల్లో నెగ్గడం గురించి.. ప్రధాని భయపడుతున్నారా? అందుకే, చిన్నాచితకా ఏ పార్టీ అయినా సరే కలుపుకోవడానికి.. ప్రజల ఎదుట బలంగా కనిపించడానికి ఆయన ఆరాటపడుతున్నారా? అనే అభిప్రాయం కలుగుతోంది.
విపక్షాలు అన్నీ ఒక్కతాటిమీదకు రావడం, ఇప్పటికే రెండు భేటీలు నిర్వహించడం అనేది దేశ రాజకీయాల్లో ఒక కీలక పరిణామంగా చెప్పాలి. ఆ కూటమి సఖ్యంగానే కొనసాగుతుందా? లేదా? లేక,కొట్టుకుంటుందా? అనేది తర్వాతి సంగతి. కానీ, దేశరాజకీయాల్లో వీరి కలయిక ఒక కదలిక మాత్రం తీసుకువచ్చింది. ప్రధానంగా ఎన్డీయే కూటమిలోను, దానికి సారథ్యం వహిస్తున్న బిజెపిలోనూ కూడా ప్రకంపనలు పుట్టించినట్టుగా కనిపిస్తోంది. దాని ఫలితమే అన్నట్టుగా.. సరిగ్గా.. విపక్షాల రెండో భేటీ ముగిసిన సమయానికి, ఎన్డీయే పార్టీ భేటీ మోడీ నిర్వహించారు.
విపక్ష కూటమి తమది దేశంలోని 26 పార్టీల కూటమి అని చెబుతుండగా.. ఎన్డీయే 38 పార్టీల కూటమి.. ఇందులో చిన్నా పెద్దా పార్టీలు లేవు.. అందరూ సమానమే అని మోడీ అంటున్నారు. ఇంకా తమతో కలిసి వచ్చే పార్టీలకు ఎన్డీయేలోకి స్వాగతిస్తున్నామని కూడా ఆయన అంటున్నారు. అయితే ఆయన చెప్పిన పార్టీల సంఖ్యాబలం మీద ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఎగతాళి చేయడం గమనించాల్సిన సంగతి. అసలు అవి అన్నీ రిజిస్టరు అయిన పార్టీలేనా అంటూ ఖర్గే హేళన చేశారు. కానీ.. విపక్షాల ఐక్యగానం పట్ల భయం పుట్టిన కారణంగానే.. ఇప్పుడు మోడీ కూడా ఏ పార్టీ వచ్చినా స్వాగతిస్తాం అంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. బిజెపి అంటేసిద్ధాంతాల పార్టీ అని, భావజాలంలో ఏకరూపత ఉంటే తప్ప ఎవ్వరితోనూ కలవరనే అభిప్రాయాలకు మోడీ సారథ్యంలో కాలం చెల్లిందనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అధికారమే పరమావధిగా ఇప్పుడు ప్రస్థానం సాగుతున్నట్లున్నదనే మాట వినవస్తోంది.
రెడ్ కార్పెట్ స్వాగతం భయానికి చిహ్నం కాదా?
Wednesday, January 22, 2025