జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎక్కువమంది ప్రజలు ఆమోదించినందువల్లనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన తన పరిపాలనను సాగించడానికి కీలకం కేవలం తన కులంవారి మీద మాత్రమే ఆధారపడితే దానిని ఎలా అర్థం చేసుకోవాలి. అన్ని కులాల వారు ఓట్లు వేస్తుంటారు కదా.. అలాగని అన్ని కులాల వారి మీద ఆయనకు నమ్మకం లేదా? రెడ్లు తప్ప తతిమ్మా అన్ని కులాలు తన మీద మండిపడుతున్నాయని ఆయన అనుకుంటున్నారా? లేదా.. ప్రభుత్వంలో కీలకమైన ఏ పోస్టుకు కూడా ఒక సమర్థుడైన ఇతర కులం అధికారి ఆయనకు కనిపించడం లేదా? లాంటి చర్చలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి.
తాజాగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు.. జగన్ లోని కులం ప్రియత్వాన్ని మరోమారు చర్చలోకి తెచ్చారు. ప్రతి పదవికీ, పోస్టుకు ఒక కులం వారు, ఒక జిల్లా వాళ్లు తప్ప మరెవ్వరూ కనిపించడం లేదా? అని ఆయన ప్రశ్నించారు. దీంతో కులం చర్చ మళ్లీ రేగింది.
సాధారణంగా ఎవ్వరైనా సరే ముఖ్యపదవిలోకి వచ్చినప్పుడు, లేదా పారిశ్రామికవేత్తగా సంస్థగా ఎదిగినప్పుడు తమకు విశ్వసనీయులు, విధేయులను తెచ్చి అనుచరులుగా పెట్టుకుంటారు. వారి మీద ఆధారపడతారు. ఈ విధేయులు అనే కోటాలో తొలి జాబితాలో బంధువులు, మిత్రులు .. ఇలా ఉండొచ్చు. ఒక దశ దాటి విస్తరించిన తర్వాత.. కులం, ప్రాంతం, మతం లాంటి గీతలు కనిపించవు. వారి వారి ప్రతిభలను బట్టి అందరి మీద ఆధారపడతారు.
కానీ.. జగన్మోహన్ రెడ్డి తీరు అలా లేదు. ఆయన దృష్టిలో తనకు ఇతర కులాల్లో విధేయులే లేరు. తనను నమ్మేవారే లేరు అన్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. అన్ని పోస్టుల్లోనూ ఆయన సీనియారిటీని కూడా దాటి వచ్చి తన కులం వారిని తన జిల్లా వారిని తెచ్చి కూర్చో బెడుతున్నారు. ఇది సర్వత్రా విమర్శల పాలవుతోంది. నిజం చెప్పాలంటే.. మంత్రి వర్గం కూర్పు లాంటి విషయాల్లో కులాల కొలబద్ధల మీద అన్ని కులాలకు సమంగా పంచినట్టు కనిపించడానికి మంత్రి బెర్తుల్ని పంచిపెట్టారే తప్ప.. సమస్త మంత్రిత్వ శాఖల నిర్ణయాధికారాలన్నీ మళ్లీ రెడ్డి వర్గం వారి చేతుల్లోనే ఉన్నాయనేది వారి ఆవేదన కూడా. మంత్రుల్లో సైతం, పార్టీ ఎమ్మెల్యలలో సైతం ఈ రెడ్డి ఆధిపత్యం కనిపిస్తూనే ఉంటుంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. రెడ్ల పెత్తనం గురించి పలుమార్లు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. తన ఇమేజికి భంగం కలిగించే ఈ పోకడలనుంచి జగన్ ఎప్పటికి బయటపడతారోమరి.
ప్రభుత్వంలో కొన్ని కీలక పదవులుంటే వాటిని అన్నింటినీ తన సొంత జిల్లాకు మాత్రమే కట్టబెట్టుకునే ఈ ముఖ్యమంత్రి.. పరిపాలనలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికే వికేంద్రీకరణ చేస్తున్నానని అంటే ఎవరు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి??
రెడ్లను తప్ప మరే కులాన్నీ జగన్ నమ్మలేరా?
Saturday, January 4, 2025