ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో అగ్రపార్టీలు రెండూ ఒకే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాయి. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం అయిన తెలుగుదేశం రెండు పార్టీలకు కూడా.. కొన్ని చోట్ల నాయకుల మధ్య గ్రూపు తగాదాలు, ముఠా కుమ్ములాటల బెడద ఉంది. ఇలాంటి ముఠా కుమ్ములాటలను ఆ రెండు పార్టీల అధినాయకులు సర్దిపుచ్చగల స్థితిలో ఉన్నారా? లేదా, దైవాధీనంగా వదిలేస్తారా? అనేది క్లారిటీ రావడం లేదు.
ఇప్పుడు రెండు అగ్రపార్టీలను రెండు ప్రధాన సమస్యలు వేధిస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఒంగోలు జిల్లా రాజకీయం గందరగోళంగా ఉంది. అక్కడ సమీప బంధువులే అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి- వైవీ సుబ్బారెడ్డి మధ్య ఉన్న ఆధిపత్య పోరు పార్టీకి పెనునష్టంగా మారుతోంది. జిల్లాలోని పార్టీ నాయకులతో బాలినేనికి తీవ్రమైన విబేదాలు నెలకొన్నాయి. రాయలసీమ జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. తన సొంత నియోజకవర్గం మీదనే కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉన్నదని ఆయన తప్పుకున్నారు. అప్పటినుంచి ఒంగోలు జిల్లా వైసీపీ రాజకీయాలు పెనం మీద వేగుతూనే ఉన్నాయి. నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదు. తాజాగా కూడా బాలినేని తాడేపల్లికి వచ్చి జగన్ తో సమావేశం అయ్యారు గానీ.. అదంతా ఏం పెద్ద ఫలవంతంగా జరిగినట్లు లేదు. నాయకులతో విభేదాలను సెట్ చేస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు మాత్రమే బాలినేని చెప్పారు. ఇలాంటి హామీల గురించి గతంలో కూడా చాలా సార్లు చెప్పారు.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి కూడా ఇలాంటి తలనొప్పులు తయారవుతున్నాయి. సత్తెనపల్లి నియోజకవర్గానికి కన్నా లక్ష్మీనారాయణను పార్టీ ఇన్చార్జిగా చంద్రబాబు నియమించారు. దీంతో అక్కడ కోడెల శివరాం నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంటుగా అయినా పోటీచేసి తీరుతానని కోడెల శివరాం భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. కోడెల కుటుంబానికి హక్కు ఉందని అంటున్నారు. సత్తెనపల్లి లో పెద్ద ర్యాలీ చేయాలని అనుకుంటున్నారు. నిజానికి కోడెల శివరాంకు నియోజకవర్గంలో ప్రజలనుంచి ఏమాత్రం పాజిటివ్ స్పందన లేదనేది సర్వేల్లో పార్టీకి అందుతున్న సమాచారం. అందుకే గతంలో పెదకూరపాడు నుంచి కాంగ్రెసు తరఫున నాలుగుసార్లు గెలిచిన లక్ష్మీనారాయణను చంద్రబాబు సత్తెనపల్లికి తీసుకువచ్చారు. ఈ వ్యతిరేకతలను ఆయన సద్దుమణిగేలా చూస్తారో లేదో గమనించాలి.
ఇలా రెండు ప్రధాన పార్టీలు కూడా స్థానికంగా కొన్నిచోట్ల ముఠాతగాదాలతో సతమతం అవుతున్నాయి.
రెండు పార్టీలకూ ముఠా కుమ్ములాటల బెడద!
Saturday, January 11, 2025