రాష్ట్ర గవర్నరుతో విభేదాలు ఉండవచ్చు గాక.. కానీ, ఆ ప్రభావం దేశ గౌరవం మీద పడేలా చేస్తే ఎలా? గవర్నరు తమిళిసై కి ప్రాధాన్యం ఉండేలా జరిగే గణతంత్ర వేడుకలను నిర్వహించడంలోనే రాజకీయ కుట్రలను, కుత్సితాలను చొప్పిస్తే ఎలా? దేశ సమగ్రతని, గౌరవాన్ని కాపాడుతానని, యావత్ దేశాన్ని ఉద్ధరించేస్తానని జాతీయ పార్టీ పెట్టి బీరాలు పలుకుతున్న కేసీఆర్ కనీసం గణతంత్ర దినోత్సవాన్ని తన రాష్ట్రంలో గౌరవప్రదంగా నిర్వహించడం గురించి పట్టించుకోరా? కేసీఆర్ మరీ ఇంత చీప్ గా ఆలోచిస్తున్నారని ప్రజలు అనుకుంటారనే ఆలోచన ఆయనకు రాదా?
రిపబ్లిక్ డే నాడు రాష్ట్రప్రభుత్వం నిర్వహించే ప్రధాన వేడుకల్లో గవర్నరు జెండా ఎగరేసి ప్రసంగించడం అనేది ఆనవాయితీ. స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి/ప్రధాని, గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో గవర్నరు/రాష్ట్రపతి జెండా ఎగరేస్తారు. వారే ప్రధాన కేంద్రంగా ఆరోజు కార్యక్రమం ఉంటుంది.
అయితే తెలంగాణలో ప్రస్తుతం గవర్నరుతో కేసీఆర్ విభేదాలు తారస్థాయిలో సాగుతున్నాయి. గవర్నరును ఏమాత్రం ఖాతరు చేయకుండా ప్రభుత్వం పరంగా గవర్నరుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యం కూడా ఇవ్వకుండా.. ఆమెను అతి అసహనానికి గురిచేస్తున్నారు కేసీఆర్. బడ్జెట్ సమావేశాల్లో అసలు గవర్నరు ప్రసంగం లేకుండానే నిర్వహించడం అనే కొత్త సాంప్రదాయాన్ని కూడా పాటిస్తున్నారు. గవర్నరు సమ్మతంతో నిమిత్తం లేకుండానే అసెంబ్లీ సభలను నిర్వహిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. గవర్నరుకు కనీసం గౌరవం కూడా దక్కకుండా పక్కన పెడుతున్న వ్యవహారాలు అనేకం ఉన్నాయి.
చివరికి గణతంత్ర దినోత్సవ వేడుకలపై కూడా ఆ విభేదాల ప్రభావం పడింది. ఈనెల 13వ తేదీన రాష్ట్రప్రభుత్వం రాజ్ భవన్ కు లేఖ రాసింది. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితుల వలన గణతంత్ర వేడుకలను రాజ్ భవన్ లోనే జరుపుకోవాలని, బహిరంగ వేడుక లేదని అందులో పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వులపై ఒకరు హైకోర్టుకు వెళ్లడంతో.. ఘనంగా నిర్వహించాల్సిందేనంటూ తీర్పు వచ్చింది. దేశభక్తిని చాటిచెప్పే పండగ నిర్వహణకు కొవిడ్ సాకు చెప్పడాన్ని తప్పుపట్టింది. అదే నిజమైతే రాష్ట్రంలో కొవిడ్ ఆంక్షలు ఎక్కడున్నాయో చెప్పాలని నిలదీసింది. కాకపోతే.. ఈ విషయంలో కోర్టు తీర్పు వేడుకలను ఘనంగా ఎప్పటిలా జరపాలని వచ్చినప్పటికీ, 26వ తేదీకి ఒకరోజు ముందు మాత్రమే రావడంతో ఆచరణలో ఎంతమేర సాధ్యం అవుతుందో అర్థం కావడంలేదు.
రిపబ్లిక్ డే పైకూడా రాజకీయ కుట్ర నీడలా?
Tuesday, January 14, 2025