నువ్వు చెక్క చిడతలతో భజన చేస్తే- నేను ఇత్తడి చిడతలతో భజన చేస్తా, నువ్వు దైవదూత అంటే అంటే నేను దేవుడే అంటా, నువ్వు దేవుడని అంటే నేను సూటిగా రాముడని అంటా అన్నట్టుగా సాగుతోంది.. బిజెపి కాంగ్రెస్ నాయకుల భజన పర్వం. గతంలో కమల నాయకులు ప్రధాని నరేంద్రమోడీని దేవుడిగా, దైవదూతగా అభివర్ణించిన సందర్భాలు ఉన్నాయి. వారికి తామేమీ తీసిపోం అన్నట్టుగా ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీని ఏకంగా రాముడితో పోలుస్తున్నారు. అయితే రాహుల్ లో రాముడి స్వరూపాన్ని చూడగలిగిన ఈ భజన హృదయం.. కాంగ్రెస్ పార్టీలోని ముస్లిం నేత సల్మాన్ ఖుర్షీద్ ది కావడం ఇంకో విశేషం.
రాహుల్ గాంధీ యోగి, తపస్వి, మహాపురుషుడు అంటూ కొనియాడిన సల్మాన్ ఖుర్షీద్.. ‘రాహుల్ రాముడి వంటి వారు.. కాంగ్రెస్ కార్యకర్తలు భరతుడి వంటి వారు. కొన్నిసార్లు రాముడు వెళ్లలేని చోటుకు భరతుడు అతని పాదుకలను తీసుకువెళ్లాడు.. అలాగే జోడోయాత్రలో రాహుల్ గాంధీ వెళ్లలేని ప్రాంతాలకు పార్టీ కార్యకర్తలే.. ఆయన సందేశాన్ని మోసుకువెళ్లాలి’ అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.
రాముడు ఉత్తరాదినుంచి దక్షిణాది చివరి వరకు వస్తే.. రాహుల్ రివర్సులో వెళుతున్నారు. రాముడు అయోధ్య నుంచి రామేశ్వరం దాకా నడుచుకుంటూ వచ్చి అటునుంచి వారధి కట్టుకుని లంకకెళ్లి యుద్ధం చేశాడు. ఇప్పుడు రాహుల్ ఇంకొంచెం దిగువ అంటే కన్యాకుమారి నుంచి నడుచుకుంటూ, ఇంకొంచెం ఎగువకు.. అంటే కాశ్మీరు దాకా వెళ్లి ఆ తర్వాత యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు. ఆ రాముడు అప్పట్లో రావణుడితో యుద్ధం చేస్తే.. ఈ రాహుల్ ఇప్పుడు మోడీతో యుద్ధం చేయాలని అనుకుంటున్నాడు.
రాముడంటే తమ పార్టీ సొత్తు కదా.. అని భావిస్తూ రామభక్తిని గుప్పిట్లో పెట్టుకుని ఉండే బిజెపి దళాలకు ఈ పోలిక ఏమాత్రం నచ్చలేదు. వారు ఖుర్షీద్ వ్యాఖ్యలపై గుస్సా అవుతున్నారు. ఇప్పుడున్న మనుషుల్లో అయితే గియితే మోడీని రాముడని అనాలి గానీ.. మరొకరిని అంటే ఎలా అనేది వారి బాధ కావొచ్చు. ఎందుకంటే.. మోడీ అంటే సాక్షాత్తూ దేవుడు పంపిన దేవదూత అని అప్పట్లో వెంకయ్యనాయుడే వ్యాఖ్యానించి బహుధా వార్తల్లోకి వచ్చారు. మోడీని దేవుడిగానే కీర్తించిన బిజెపి ప్రముఖులు కూడా ఉన్నారు. కానీ వారికి రాహుల్ ను అలా అనడం మాత్రం నచ్చడం లేదు. వారి ఓర్వలేని విమర్శలను ఖుర్షీద్ పట్టించుకోవడం లేదు. ‘దేవుడు దేవుడే. కానీ.. దేవుడి మార్గాన్ని అనుసరించేవారిని ఆయనతో పోలిస్తే తప్పులేదు.’ అని సమర్థించుకుంటున్నారు. సల్మాన్ ఖుర్షీద్ కు రాహుల్ గాంధీలో దైవాంశ కనిపిస్తే తప్పులేదుగానీ.. అల్లాతో పోల్చకుండా రాముడితో పోల్చాడేమిటి చెప్మా?
రాహుల్ రామాయణం.. బీజేపీ పారాయణం!
Tuesday, December 24, 2024