ఆయన ఒకచోట పోగొట్టుకున్నారు. కానీ, ఆ పోగొట్టుకున్నదేదో మరొకచోట ఆయనకు లభించింది! అంతటితో ఆయన సంతృప్తి చెందలేదు. తనకు లభించిన దానిని పక్కనపెట్టి, పోగొట్టుకున్నచోట మళ్లీ వెతుక్కోవాలని ఆరాటపడుతున్నారు. ఆయన మరెవరో కాదు! కాంగ్రెస్ పార్టీ తరఫున భావి ప్రధాని అనే ఆద్వితీయ హోదాను కలిగి ఉన్న రాహుల్ గాంధీ! తను పోగొట్టుకున్న ఎంపీ పదవిని ఆయన తిరిగి అమేధీలోనే వెతుక్కుంటున్నారు.
రాహుల్ గాంధీ కుటుంబం ఉత్తర ప్రదేశ్ లోని అమేధీని సొంత నియోజకవర్గంగా కలిగి ఉంది. ఆయనకు ముందు కుటుంబ సభ్యులు అక్కడి నుంచే గెలుపొందారు. తండ్రి రాజీవ్, తల్లి సోనియా అక్కడినుంచే ఎంపీలయ్యారు. 2004నుంచి రాహుల్ అమేథీ నుంచే వరుసగా మూడుసార్లు గెలిచారు. 2014లో ఆయనతో తలపడి ఓటమిపాలైనప్పటికీ స్మృతి ఇరానీ కి ప్రధాని మోడీ అప్పట్లో మంత్రి పదవిని కట్టబెట్టారు. అదే 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చే సమయానికి పరిస్థితులు మారాయి. భారతీయ జనతా పార్టీ మరింత బలపడింది. రాహుల్ గాంధీ కుటుంబానికి అత్యంత సురక్షిత స్థానం అని చెప్పదగిన అమేధీ ప్రజలు రాహుల్ ను ఓడించారు. స్మృతి ఇరానీ ఈసారి లోక్ సభ సభ్యురాలుగా పార్లమెంటులో అడుగుపెట్టి మళ్ళీ మంత్రి అయ్యారు.
నిజానికి ఇది రాహుల్ గాంధీకి అతి పెద్ద పరాభవంగా పరిగణించాలి. అయితే గుడ్డిలో మెల్ల అన్నట్టుగా, రాహుల్ దక్షిణాది రాష్ట్రాల ముఖ ప్రీతి కోసం అన్నట్లుగా ఆ సమయంలో కేరళలోని వయనాడు నుంచి కూడా రంగంలోకి దిగారు. కేరళ ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. పార్లమెంట్లో సభ్యుడిగా కొనసాగడానికి కేరళ ప్రజల దీవెన ఆయనకు దిక్కయింది. ఇన్నాళ్లుగా కేరళ నుంచి ఎంపీగానే ఆయన పని చేస్తున్నారు. జైలు శిక్ష కేసులో సుప్రీంకోర్టు కొంత ఊరట ఇచ్చిన తర్వాత కూడా వయనాడు వచ్చి ప్రజలను పలకరించి వెళ్లారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి ఆయన తిరిగి అమేథీ నుంచి మాత్రమే పోటీ చేయాలని అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ పీసీసీ సారథి రాయ్ స్పష్టం చేశారు.
వయనాడు ప్రజలు మళ్లీ గెలిపించే అవకాశం లేదని గ్రహించారో, లేదా పోగొట్టుకున్న చోటనే తన పరువు మర్యాదలను వెతుక్కోవాలని భావించారో, లేదా అమేథీలో తాను స్వయంగా బరిలోకి దిగితే యావత్తు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పార్టీకి అనుకూల పవనాలు ఏర్పడతాయని అంచనాలు వేస్తున్నారో తెలియదు కానీ మొత్తానికి అమేథీలో బరిలోకి దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అదే సమయంలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ వధేరా వారణాసి నుంచి పోటీ చేస్తుందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నుంచి బరిలోకి దిగడానికి ప్రియాంక గాంధీ ఉత్సాహపడుతున్నారని, వారణాసి ప్రజలందరూ కూడా ప్రియాంక నేతృత్వాన్ని కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది! సోనియా గాంధీ కుటుంబ వారసులు భావి సార్వత్రిక ఎన్నికల విషయంలో నియోజకవర్గాలను ఎంచుకోవడంలో ఇప్పుడు ఎలాంటి ఆలోచనలతో ముందుకు సాగుతారో వేచి చూడవలసి ఉంది.