నేను రాజకీయం చేయడానికి పాదయాత్ర చేయడంలేదు. దేశమంతా ప్రేమను పంచడానికి ఈ పాదయాత్ర చేస్తున్నాను. ప్రేమద్వారా దేశాన్ని ముడివేయడానికి, బంధాన్ని ఏర్పరచడానికి యాత్ర చేస్తున్నాను.. అని రాహుల్ పదేపదే చెబుతూ నడుస్తున్నారు. అయితే.. ఆయన పాదయాత్ర అసలు లక్ష్యం రాజకీయమే అనేది ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయ అవసరాలకోసం ఏ రాష్ట్రంలో అడుగు పెడుతోంటే.. అక్కడి భాజపాయేతర, తమకు మిత్రులు కాగల అందరు పార్టీల నేతలను కూడా యాత్రకు ఆహ్వానిస్తూ వారితో కలిసి నడుస్తూ.. యాత్రకు ఒక హైప్ తీసుకురావడానికి రాహుల్ అనుచరగణం, కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నాయి.
వ్యవహారం ఇలా నడుస్తుండగా.. బంధం ముడిపెడదాం (జోడో) అనే నినాదంతో రాహుల్ యాత్ర చేస్తోంటే.. కొన్నిచోట్ల ఆ నినాదం వ్యతిరేక ఫలితాన్ని ఇస్తున్నదా అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. ఎందుకంటే.. ప్రస్తుతానికి జోడోయాత్రకు విరామం కొనసాగుతోంది. 9 రోజుల విరామం ప్రకటించారు. కొత్త సంవత్సరాది తర్వాత.. 3వ తేదీన మళ్లీ మొదలై అదేరోజు ఉత్తరప్రదేశ్ లోకి ప్రవేశిస్తుంది.
ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ లో తమకు ఉండగల బలగాల్ని అంతా సమీకరించాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఏమాత్రం సానుకూల పరిణామాలు కనిపించడం లేదు. రాహుల్ రాజకీయానికి, బిజెపి వ్యతిరేకత ఒక్కటే ఎజెండా గనుక.. యూపీలో ఉన్న ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, బీఎస్పీ నేత మాయావతి, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌధురి లను కాంగ్రెస్ పార్టీ యాత్రలో పాల్గొనాలని ఆహ్వానించింది. అయితే వారేం పెద్దగా స్పందించలేదు. గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని యూపీ ఎన్నికల్లో పోటీచేసిన చరిత్ర కూడా ఉన్నప్పటికీ అఖిలేష్ యాదవ్ తాను రాహుల్ యాత్రలో పాల్గొనడం లేదని తేల్చేశారు. ఆర్ఎల్డీ జయంత్ చౌధురి వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నానని చెప్పారు. బీఎస్పీ మాయావతి కూడా ఇంకా తేల్చలేదు.
భారత్ జోడో అంటూ రాహుల్ గాంధీ సాగిస్తున్న యాత్ర సంగతి ఏమో గానీ.. వారికి గతంలో ఉన్న రాజకీయ బంధాలు కూడా ‘తోడో’ (విరిగిపోతున్నాయి) అవుతున్నాయి. కన్యాకుమారిలో రాహుల్ తన పాదయాత్రను ప్రారంబించినప్పుడు అక్కడ ఆయన వెంట స్టాలిన్ ఉన్నారు. దారిలో మిత్రపక్షాల వారు ఆయనతో కలిసి నడిచారు. తన పాదయాత్రలో ప్రాంతీయ పార్టీల నాయకులను కూడా కలుపుకుని కొద్దిదూరం నడవడం ద్వారా.. మోడీకి వ్యతిరేకంగా సాగించే పోరాటంలో.. భవిష్యత్తులో ఆయా పార్టీల వారంతా కాంగ్రెస్ కు అండగా ఉండబోతున్నారని సంకేతాలు ఇవ్వాలనేది రాహుల్ ఆలోచన. అయితే, అందుకు పాతమిత్రుడు అఖిలేష్ యాదవ్ కూడా సుముఖంగా లేరు. ఆయన కూడా కాంగ్రెస్ సారథ్యంలోని కూటమిలో ఉండలేం అని సంకేతాలు ఇవ్వడానికే రాహుల్ పాదయాత్రకు దూరంగా ఉండాలనుకుంటున్నారా? అనే అభిప్రాయం కూడా పలువురిలో కలుగుతోంది.
ప్రేమను పంచి దేశంలోని ప్రజలను ఒక్కటిగా సమైక్యం చేస్తానంటున్న రాహుల్ బాబా.. ఆ పని చేయడంలో సఫలం అవుతారేమో గానీ.. ప్రాంతీయ పార్టీలన్నింటినీ కాంగ్రెస్ తో జోడించి అధికారంలోకి తీసుకురాగలరా? అనే సందేహాలు పుడుతున్నాయి.