కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పాపం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీరం వరకు ఈ యువనేత దేశంలోనే అతి సుదీర్ఘమైన పాదయాత్రను సాగించారు గానీ, ఆ కష్టం పార్టీకి కొంత ఉపయోగపడింది తప్ప.. ఆయన లాభపడలేదు. అంతటి పాదయాత్ర ఇవ్వగల కీర్తిని.. ఆయన నోటి దురుసు మింగేసింది. కనీసం ఎంపీ అనే హోదా కూడా లేకుండా పోయారు రాహుల్!
ప్రధాని నరేంద్రమోడీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ వెంటనే ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోతున్నట్టుగా పార్లమెంటు నోటిఫికేషన్ ఇచ్చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. ఏదైనా క్రిమినల్ కేసులో రెండేళ్లు లేదా అంతకు మించిన జైలు శిక్ష పడిన నాయకుడి.. ప్రజాప్రతినిధి తక్షణం రద్దవుతుంది. పైగా మరో ఆరేళ్ల పాటు మళ్లీ ఎన్నికల్లో పోటీచేయడానికి వీలు కూడా లేకుండా పోతుంది. ఆ నిబంధన మేరకు రాహుల్ ఎంపీ పదవి పోయింది.
అసలే బిజెపి హవాలో రాహుల్ కొన్ని దశాబ్దాలుగా తమ కుటుంబాన్ని నెత్తిన పెట్టుకున్న యూపీలోని అమేథీ నియోజకవర్గంలో ఓడిపోయారు. ఆ ఎన్నికలలో దక్షిణాది ముద్ర కోసం కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీచేసిన రాహుల్ అదృష్టం బాగుండి అక్కడ గెలిచారు. ఆయన సొంత నియోజకవర్గం అమేథీ పోయింది. ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయగానే.. పార్లమెంటు అధికారులు ఆయన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సిందిగా కూడా నోటీసులు ఇచ్చారు. ఈలోగా రాహుల్ తనకు పడిన జైలుశిక్ష మీద హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం ప్రారంభించారు. కానీ, ఆ న్యాయపోరాటంలో ఇంకా ఏ సంగతీ తేలలేదు గనుక.. క్వార్టర్ ఉంటుందని ఆయన అనుకున్నారు గానీ.. అలా జరగలేదు. నివాసాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది.
తీరా ఇప్పుడు కేరళలోని వయనాడ్ నియోజకవర్గంలో ఎంపీ పదవి ఖాళీ గనుక.. అక్కడ ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అధికారిక నోటిఫికేషన్ ఇంకా వెలువడలేదు గానీ.. పార్లమెంటు ఒకసారి వయనాడ్ సీటును ఖాళీ అయినట్టుగా గుర్తించి, ఈసీకి ఆమేరకు సమాచారం పంపిన తర్వాత.. ఆటోమేటిగ్గా ప్రాసెస్ ప్రారంభం అయిపోయినట్టే. ఎవరో వెనుకనుండి ఈసీని నడిపిస్తున్నారని కాంగ్రెస్ పసలేని ఆరోపణలు చేసుకోవచ్చుగానీ ఉపయోగం లేదు. రాహుల్ పై హైకోర్టు తీర్పు వెలువరించేలోగా.. వయనాడ్ ఉప ఎన్నిక కూడా పూర్తయిపోవచ్చు. ఆయన అధికారిక నివాసాన్ని మాత్రమే కాదు, గెలిపించిన ఊరిని కూడా ఖాళీచేయాల్సి వస్తుంది. హైకోర్టు తీర్పు వచ్చేదాకా ఉపఎన్నిక నిర్వహించకుండా ఈసీని ఆదేశించాలని మరోసారి కోర్టను ఆశ్రయించడం తప్ప రాహుల్ ఎదుట మరో ప్రత్యామ్నాయం లేదు.
రాహుల్ : ఇల్లు పాయె.. సీటు కూడా పోయేనా?
Wednesday, December 18, 2024