తెలుగుదేశం పార్టీ ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. 2014 లో రాష్ట్ర విభజన తర్వాత తొలి పరిపాలన అవకాశం చంద్రబాబు చేతికే వచ్చినప్పటికీ.. మలి అవకాశాన్ని జగన్ దక్కించుకున్నారు. ఇంకో ముప్ఫయ్యేళ్ల పాటు సీఎం కుర్చీలో స్థిరంగా ఉండాలనే లక్ష్యంతో జగన్ ఇంటింటికీ సర్కారు సొమ్మును వేల కోట్లుగా పంచిపెట్టే పనులు చేస్తున్నారు. అభివృద్ధి అనేది పాతర వేసేసి, డబ్బు పంచడమే సంక్షేమం అని చెప్పుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ అరాచకత్వంపై ప్రజల్లో చైతన్యం తెచ్చి.. వచ్చే ఎన్నికల్లో నెగ్గడం టీడీపీకి పెద్ద సవాలు! అందుకు చంద్రబాబు నేతృత్వంలో వ్యూహాత్మకంగా కష్టపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఎంతో సీనియర్లు అయినప్పటికీ.. రాయపాటి సాంబశివరావు వంటి నాయకులు పార్టీకి చేటు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు గనుక టీడీపీ నెగ్గకపోతే ఇక ఎప్పటికీ సాధ్యం కాదు అనే స్థాయిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటప్పుడు కూడా రాయపాటి తన స్వార్థ ఆలోచనలే తప్ప పార్టీ ప్రయోజనాల గురించి పట్టించుకోకుండా సంకుచితంగా మాట్లాడుతున్నారు.
గుంటూరు జిల్లాలోని బిజెపి కీలక నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడం అనేది ఆ పార్టీకి పెద్ద బలమే. అయితే రాయపాటికి కన్నాతో వ్యక్తిగత తగాదాలు ఉన్నాయి. ఇద్దరూ కాంగ్రెస్ నాయకులే అయినప్పటికీ.. అప్పటినుంచి కొట్టుకుంటూనే కొనసాగుతున్నారు. ఇప్పుడు తెలుగుదేశం విశాల ప్రయోజనాలకోసం ఆ కక్షలను పక్కన పెట్టాల్సిన రాయపాటి.. ముసలితనం మీద పడ్డా కూడా.. ఇంకా తనకు శత్రుత్వం కంటిన్యూ అవుతోందని చెప్పడం విశేషం. అంటే ఇప్పుడు చంద్రబాబు కన్నా కు టికెట్ ఇస్తే గనుక.. ఓడించడానికి రాయపాటి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తారని అర్థమవుతోంది.
అదే సమయంలో.. ఎనభయ్యేళ్ల రాయపాటి సాంబశివరావు.. ఇప్పుడు తనకు నరసరావుపేట టికెట్ కావాలని అంటున్నారు. దానికి అదనగా తన కొడుకు రంగారావుకు ఒక టికెట్, తన తమ్ముడు కూతురు శైలజకు మరో టికెట్ కూడా అడుగుతున్నారు. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నట్టుగా ఉంది. తన కుటుంబానికి మూడు టికెట్లు అడుగుతున్న రాయపాటి స్వతహాగా టీడీపీ నాయకుడు కూడా కాదు. మొన్నటిదాకా కాంగ్రెసులో ఉండి, ఆ పార్టీ సర్వనాశనం అయ్యాక మాత్రమే ఇటు వచ్చాడు. ఇలాంటి స్వార్థపరులు మరో ఇద్దరు ముగ్గురు పార్టీలో ఉంటే చాలు.. వాళ్ల అస్తిత్వమే తెలుగుదేశానికి పతనం నిర్దేశిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.
రాయపాటి లాంటి నేతలతో టీడీపీకి మహా నష్టం!
Sunday, January 19, 2025