తెలంగాణ రాష్ట్రంలో తిరిగి నిలదొక్కుకోవడానికి తెలుగుదేశం పార్టీ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతానికి శాసనసభలో ప్రాతినిధ్యం కూడా లేని తెలుగుదేశం పార్టీని. తిరిగి జవసత్వాలు పుంజుకునేలా చేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈనెల 23వ తేదీ నుంచి జిహెచ్ఎంసి పరిధిలోని మొత్తం 24 నియోజకవర్గాలను కవర్ చేస్తూ బస్సు యాత్ర నిర్వహించబోతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి వద్ద ఈ యాత్రను చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుత వ్యవహార సరళి గమనిస్తుంటే భాగ్యనగరంలోనే కొన్ని సీట్లు అయినా గెలిచి పార్టీ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది.
తెలంగాణలో తెలుగుదేశం బాగా దెబ్బతిన్న సంగతి అందరికీ తెలిసిందే. విభజన తర్వాత తెలుగుదేశం తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు అందరినీ కూడా రకరకాల ప్రలోభాలతో ఆకట్టుకుని కేసీఆర్ తమ పార్టీలో కలిపేసుకున్నారు. టిడిపి పూర్తిగా ఖాళీ అయింది. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న ఎల్ రమణకు కూడా ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసి భారాసలో కలిపేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ తెలుగుదేశం పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో భారీగా బహిరంగ సభ కూడా నిర్వహించారు. తెలుగుదేశం తప్పకుండా తెలంగాణలో పూర్వవైభవం సంతరించుకుంటుందని, క్షేత్రస్థాయిలో ప్రజల్లో అభిమానం అలాగే పదిలంగా ఉన్నదని చంద్రబాబునాయుడు కూడా అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ అభిమానించే కార్యకర్తలలో కాస్త ఉత్సాహం నింపారు. ఎన్నికలలోగా రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం నాయకుల బస్సు యాత్ర నిర్వహించాలని కాసాని జ్ఞానేశ్వర్ ముందుగానే సంకల్పించారు. ఆ బస్సు యాత్రలో మొదటి భాగంగానే జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పుడు నిర్వహించబోతున్నారు.
భాగ్యనగరం ఇప్పుడున్న ఐటీ హబ్ అనే గుర్తింపుతో కూడిన అద్భుతమైన అభివృద్ధి స్థాయికి చేరుకోవడానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు చేసిన కృషే కారణం అనే అభిప్రాయం ప్రజలందరిలోనూ ఉంది. హైదరాబాదు నగర అభివృద్ధిలో ఐటీరంగం పాత్ర ఎంత ఉన్నదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఐటీ రంగం ఇక్కడ ఇంతగా స్థిరపడడానికి చంద్రబాబు కృషి ఏమిటనేది కూడా అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో కాస్త కష్టపడి పని చేయగలిగితే హైదరాబాదు నగరంలో కొన్ని సీట్లు అయినా తాము చేజిక్కించుకోగలం అనే నమ్మకం తెలుగుదేశానికి ఉంది. ప్రయత్నం లోపం లేకుండా ఇప్పుడు బస్సు యాత్ర చేయబోతున్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే సత్ఫలితాలు ఉంటాయని అభిప్రాయం ప్రజల్లో ఉంది.