విశాఖలో రాజధాని అనే పేరుతో ఉత్తరాంధ్ర వాసులను మభ్యపెట్టడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల మయోపాయాలు చేయవచ్చో అన్ని చేస్తోంది. సుప్రీంకోర్టులో దావాలు ఇంకా విచారణలో ఉండడం.. హైకోర్టు తీర్పు పూర్తి ప్రతికూలంగా ఉండడం.. తదితర కారణాల నేపథ్యంలో విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధానిని తరలించడం అనేది ఇప్పట్లో సాధ్యం కాని వ్యవహారమే అయినప్పటికీ, ఆ మాట చెప్పి ప్రజలను బురిడీ కొట్టించడానికి వాళ్లు మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా శ్రీకాకుళంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో.. ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంచార్జి వై వి సుబ్బారెడ్డి మళ్ళీ విశాఖ రాజధాని పాట పాడారు. ఏప్రిల్ తర్వాత రాజధాని విశాఖకు వచ్చేస్తుందని ఆయన సెలవిచ్చారు. ‘ఏప్రిల్ తర్వాత’ అంటే అర్థం ఏమిటి? ఆయనకైనా క్లారిటీ ఉన్నదో లేదో మనకు తెలియదు.
2026 సంవత్సరంలో రాజధాని మార్పునకు ప్రయత్నాలు మొదలైనా సరే.. దానిని ‘ఏప్రిల్ తర్వాత’ అనే నిర్వచనం కిందికి తీసుకురావచ్చు. అది అబద్ధం అనిపించుకోదు. అందుకే వైవి సుబ్బారెడ్డి కూడా ‘ఏప్రిల్ తర్వాత’ రాజధాని వస్తుంది అంటున్నారే తప్ప.. ‘ఎప్పటిలోగా’ రాజధానిని తీసుకువస్తాం అని కచ్చితత్వాన్ని సూచించే హామీ ఇవ్వలేకపోతున్నారు. ఇది కేవలం ఉత్తరాంధ్ర ప్రజలను మోసం చేయడానికి చెబుతున్న మాటే తప్ప మరొకటి కాదు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఫలానా తేదీలోగా విశాఖకు రాజధాని తీసుకొస్తాం అని ప్రకటించాలి. ముఖ్యమంత్రి నివాసం ఎక్కడ ఉందనేది ప్రయారిటీ కానే కాదు. ఆయన కోరుకుంటే కనుక ఇడుపులపాయ ఎస్టేట్లో క్యాంప్ ఆఫీసు నిర్వహిస్తూ, అదే తన నివాసంగా ఉంచుకుని అమరావతి రాజధానిగా పాలన సాగించవచ్చు. ఎవరికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. సీఎం నివాసం మారడం వేరు.. రాజధాని మారడం వేరు. ఈ మాటల గారడీని ఉత్తరాంధ్ర ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అందుకే సీఎం నివాసం విశాఖపట్నం కు మారితే మారవచ్చు గాక.. దాన్ని చూపించి, మరోసారి మాయ చేయకుండా, ‘ఎప్పటిలోగా క్యాపిటల్ వస్తుంది’ అనేది చెప్పాలి. ఆలోగా రాకపోతే తాము ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాం అని ప్రకటించాలి.
అంతే తప్ప చీటికిమాటికి ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు వారి అభిప్రాయం అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఒక సభ పెట్టి త్వరలోనే విశాఖకు రాజధాని వచ్చేస్తుంది అనే పాచిపోయిన పడికట్టు పదాలను వినిపించడం వారికి పాడి కాదు. ఈ తరహా నయా వంచన శైలిని ఉత్తరాంధ్ర ప్రజలు గమనిస్తే గనుక వచ్చే ఎన్నికల్లో గట్టిగానే బుద్ధి చెప్తారు.