కెఎ పాల్ అంటే.. ఆయనను అందరూ కూడా ఒక రాజకీయ కమెడియన్ గానే చూస్తుంటారు. కానీ సోకాల్డ్ ఘనాపాటీలు అనదగిన, మహామహులైన రాజకీయ నాయకులు ఎవ్వరూ చేయని పనిని కెఎ పాల్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం చేస్తున్నారు. అందరూ మాటలు చెప్పేవాళ్లే తప్ప స్టీల్ ప్లాంట్ విషయంలో నిర్దిష్టమైన గట్టిపోరాటానికి దిగిన వారు లేరు. అయితే కెఎ పాల్ మాత్రం.. స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణను వ్యతిరేకిస్తూ నిరవధిక నిరాహారదీక్షకు కూర్చున్నారు.
స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణ విషయంలో ప్రధాన పార్టీలేవీ పెద్దగా నోరు మెదపడం లేదు. ఉద్యమించడం లేదు. ప్రధానంగా అధికార పార్టీని గమనించినట్లయితే కేంద్రం ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తే వైఖరితో వ్యవహరిస్తున్నదే తప్ప.. స్టీల్ ప్లాంట్ కోసం కనీసమాత్రంగా కూడా వారు ప్రయత్నించడం లేదు. అయితే గతంలో వేలానికి ప్రయత్నం జరిగినప్పుడే.. కెఎ పాల్.. తాను స్టీల్ ప్లాంట్ ను కొంటానంటూ చాలా పెద్ద హడావుడే చేశారు.
ఇప్పుడు కూడా.. ఆమరణ నిరాహారదీక్షకు పూనుకోవడం వరకు ఆయన ప్రయత్నాన్ని గట్టిదిగానే చెప్పాలి గానీ.. తతిమ్మా ఆయన మాటలన్నీ మళ్లీ కామెడీ డైలాగుల్లాగానే నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ ను కారుచౌకగా అదానీక కట్టబెట్టడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని తొలినుంచి ఆరోపిస్తున్న పాల్, 8 లక్షల కోట్ల విలువైన ప్లాంట్ ను 4 వేల కోట్లకు అమ్మేస్తున్నారని అంటున్నారు. కోర్టు అనుమతి ఇస్తే గనుక.. లక్షల కోట్లు విరాళాలు తెచ్చి స్టీల్ ప్లాంట్ ను కాపాడుతానని అంటున్నారు. దానితో పాటు పదిలక్షల ఉద్యోగాలు కూడా ఇప్పిస్తారట. స్టీల్ ప్లాంట్ ప్రెవేటీకరణ ఆపేస్తాం అని కేంద్రం ప్రకటించే వరకు తన దీక్ష కొనసాగిస్తానని కూడా ఆయన ప్రతిజ్ఞ చేశారు.
అయితేఇవాళ్టి రోజుల్లో ఆమరణ నిరాహార దీక్షలు అనేవి కూడా కామెడీ అయిపోయాయి. ఎందుకంటే.. కనీసం రెండు మూడు రోజులు నికరంగా తిండి లేకుండా కూర్చోగలిగే పరిస్థితి ఉంటే చాలు. మూడోరోజు రాత్రికెల్లా పోలీసులు వచ్చి బలవంతంగా తీసుకువెళ్లి ఆస్పత్రిలో చేర్పించేస్తారనే సంగతి అందరికీ తెలుసు. పోలీసులు బలవంతంగా తీసుకెళ్లినా వైద్యానికి కూడా నిరాకరిస్తూ, ఆస్పత్రినుంచి బయటకు వచ్చిన తర్వాత.. మళ్లీ అదే శిబిరంలో అదే నిరాహార దీక్షను కొనసాగించే వారెవరైనా ఉంటే వారి మాటను మాత్రమే నమ్మవచ్చు. ఆమరణ దీక్షఅనేది కూడా ఒక రాజకీయ డ్రామాగా మారిపోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు.
రాజకీయ కమెడియనే గానీ.. ప్రయత్నం గొప్పది!
Sunday, December 22, 2024