‘‘ఒక ఎలక మా ఇంట్లో పిల్లి ఉంది.. అని చెప్పింది అనుకోండి.. అది చచ్చిపోతే అందరికీ పిల్లి మీదేగా అనుమానం వస్తుంది..’’ అనే డైలాగు ‘మల్లీశ్వరి’ సినిమాలో ఉంటుంది. అయితే ఆ సినిమా స్క్రిప్ట్ రాసినది త్రివిక్రమ్ శ్రీనివాస్. పోసాని కృష్ణ మురళి ఎంత మాత్రమూ కాదు. అయినా సరే తాను కూడా స్క్రిప్ట్ రైటర్ అయిన పోసాని ఆ సినిమా చూడకుండా ఉంటారని, ఆ డైలాగు గాని, ఆ డైలాగులోని నీతి గాని తెలియకుండా ఉంటారని అనుకోవడం భ్రమ. అదే నీతిని ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఆచరణలో పెడుతున్నారు.
నారా లోకేష్ తన మీద వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి పోసాని కృష్ణ మురళి సుదీర్ఘమైన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ గతంలో ఎవరిని విమర్శించలేదా అని ప్రశ్నించారు. లోకేష్ మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ల పాటు ఆయన జైలులోనే ఉండాల్సి వస్తుందని తన న్యాయ పరిజ్ఞానం కూడా ప్రదర్శించారు. నారా లోకేష్ వ్యాఖ్యలలో అంత తీవ్రమైన విమర్శలు ఉన్నాయని అనుకుంటే పోసాని కూడా ఆ వ్యాఖ్యల వల్ల నష్టపోయిన వారితో ఒక పరువు నష్టం దావా వేయించవచ్చు కదా. ఇలా మీడియా ముందుకు వచ్చే అవాకులు చవాకులు పేలడం ఎందుకు అనేది అందరికీ కలుగుతున్న సందేహం. లోకేష్ కు ఆయన జోస్యం చెబుతున్నట్టుగా ఇరవయ్యేళ్ల జైలు శిక్ష పడితే గనుక.. ఆయన ఎన్నికలకు కూడా దూరమై.. వైసీపీ వారికి ఆటంకం కూడా తొలగిపోతుంది కదా.. అనేది ప్రజల మాట.
అయితే ఈ సందర్భంగా పోసాని మరో విషయం కూడా చెప్పారు. నారా లోకేష్ తన మీద హత్యాప్రయత్నం చేయిస్తున్నారట. తాను కోర్టుకు వెళ్లే సమయంలో తనని హత్య చేయించాలని అనుకుంటున్నారట. ఈ విషయంతో పోసాని తాను గొప్ప స్క్రిప్టు రైటర్ అని ప్రజలకు గుర్తు చేయాలని అనుకున్నట్లున్నారు. ఎందుకంటే.. తనను తిట్టినందుకు పోసానిని హత్య చేయించాలని అనుకుంటే గనుక… అస్సలు ఆ తిట్ల గురించి ఏమాత్రమూ స్పందించకుండా.. ఆ ఒక్క పనీ గుట్టు చప్పుడు కాకుండా చేయిస్తే సరిపోతుంది కదా అనేది ప్రజల సందేహం. అలాగే, పోసాని చెబుతున్నట్టుగా ఆయన కోర్టుకు వెళుతున్నప్పుడు ఎందుకు హత్య చేయించాలి. కోర్టుకు వెళ్లేప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో పోసాని ఏమైనా జడ్ క్యాటగిరీ భద్రత మధ్య దుర్భేద్యంగా ఉంటారా? అనేది ప్రజల రెండో సందేహం. ఇలా లాజిక్ లేకుండా.. తన మీద కోర్టులో పిటిషన్ ఉన్నది గనుక.. లోకేష్ మీద అక్కసు వెళ్లగక్కడానికి పోసాని మరీ తలాతోకాలేకుండా మాట్లాడుతున్నారని ప్రజలు భావిస్తున్నారు.