రాజకీయ నాయకులకు కొంత సీనియారిటీ రాగానే కొమ్ములు మొలుస్తుంటాయి. పార్టీ కంటె తామే అధికులం అనే భావన ఏర్పడుతుంది. తమను చూసి ప్రజలు గెలిపిస్తున్నారే తప్ప.. పార్టీని చూసి కాదనే అభిప్రాయమూ ఏర్పడుతుంది. తామే స్వయంగా ఒక పార్టీగా అవతరించగలిగినంత సత్తా ఉన్నవాళ్లం అనే నమ్మకం చిక్కుతుంది. పార్టీలో తలెగరరేసి ప్రవర్తించడం ప్రారంభిస్తారు. పార్టీ నిర్ణయాలతో విభేదించడం ప్రారంభిస్తారు. ‘ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం’ అనే అందమైన అబద్ధం చెప్పి చివరికి సొంత పార్టీ పెట్టుకుంటారు. సొంత పార్టీ పెట్టిన తర్వాత.. అందులో ఉండే నొప్పులన్నీ స్వానుభవంలోకి వస్తాయి. పార్టీ నిర్వహణ అంటే ఆషామాషీ కాదనే సత్యం బోధపడుతుంది. వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూ ఉంటాయి. స్వయంగా తాను గెలవడం కూడా ఒక్కోసారి కష్టమైపోతుంది. అప్పటికి కళ్లు తెరచుకుని, తిరిగి మాతృపార్టీలో కలిసిపోవడమో, లేదా ఇంకో పార్టీలో విలీనం కావడమో చేస్తారు. ఇదంతా సీనియర్ నాయకుల గురించిన విశ్లేషణ. అయితే, రాజకీయాల్లో ఇంకా బొడ్డూడని నాయకుడు కూడా పార్టీతో విభేదించి.. తనకు తానుగా సొంత పార్టీ పెట్టుకుంటే ఆ పరిణామాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అదే జరుగుతోంది.
బోడె రామచంద్రయాదవ్ అంటే.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా.. రాజకీయాలను ఆసక్తిగా గమనించే వారికి రామచంద్రయాదవ్ పేరు తెలుసు. ఆయన పుంగనూరు నియోజకవర్గంలో 2019 ఎన్నకల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై జనసేన పార్టీ తరఫున పోటీచేశారు. 16వేల ఓట్లు వచ్చాయి. మూడోస్థానంలో నిలిచారు. ఆ ఓటమితో ఆయన ఊరుకుండిపోలేదు. అప్పటినుంచి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ ధోరణులకు వ్యతిరేకంగా ప్రజాందోళనలను నిర్వహిస్తూ వచ్చారు. అనేక సార్లు హౌస్ అరెస్టు అయ్యారు. బలమైన నాయకుడిగా నియోజకవర్గంలో ఎదుగుతున్నారు. పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సరైన అభ్యర్థి లేరు. నామమాత్రం ఒక ఇన్చార్జి ఉన్నారు. అయితే ఎన్నికల సమయానికి పొత్తులు కుదరడంలో భాగంగా.. ఎటూ పుంగనూరు తెలుగుదేశానికే దక్కుతుందని, రామచంద్రయాదవ్ జనసేన నుంచి తెలుగుదేశంలో చేరి.. ఆ పార్టీ తరఫున పోటీచేస్తారని, ఈసారి ఎన్నికల్లో ఆయనకు సానుకూల అవకాశం ఉంటుందని ప్రజలు అంచనా వేస్తున్నారు.
అయితే హఠాత్తుగా బోడె రాంచంద్రయాదవ్ సొంత పార్టీ స్థాపిస్తున్నట్టుగా ప్రకటించడమే తమాషా. రాజకీయంగా ఇంకా తొలిఅ డుగులు కూడా శుభ్రంగా వేయని ఆయన, వచ్చే నెల 23న రాజకీయ పార్టీని ప్రకటిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారట. రాజకీయాల్లో నాయకులు ఇలాంటి తప్పులు చేస్తుండడం చాలా సహజం అని, అందుకే రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు మాత్రమే అనే సామెత పుట్టిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి తప్పుల ద్వారా.. పలువురు తమ రాజకీయ జీవితానికి తామే చరమగీతం పాడుతుంటారని కూడా అంటున్నారు.