తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మీద క్రమంగా దూకుడు పెంచుతున్నారు. తెలుగుదేశం మహానాడులో విడుదల చేసిన తొలివిడత మేనిఫెస్టో కు దక్కుతున్న ప్రజాదరణ కొంత ఉత్సాహం ఇస్తుందనడంలో సందేహం లేదు. పొత్తులకోసం అమిత్ షా తో భేటీకి చంద్రబాబునాయుడు వెళ్లడం కూడా ఆయనకు ఇంకాస్త జోష్ అందించి ఉంటుంది. యువగళం పాదయాత్రలో భాగంగా కడప జిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్.. సీఎం సొంత ప్రాంతంలోనే ఆయన మీద రెచ్చిపోతున్నారు.
‘హూ కిల్డ్ బాబాయ్’ నినాదాలు పోస్టర్లతో ఇప్పటికే జగన్ ను రెచ్చగొడుతున్న నారా లోకేష్.. ‘రహస్య సాక్షి’ అనే ఎపిసోడ్ ను తన విమర్శల్లో చాలా చక్కగా వాడుకుంటున్నారు. ఇటీవల హైకోర్టుకు వివరాలు సమర్పిస్తున్న సమయంలో.. సీబీఐ.. వైఎస్ వివేకా హత్య కేసుకు సంబంధించి అవినాష్ రెడ్డి పాత్రను నమ్మడానికి.. రహస్య సాక్షి అందించిన వివరాలు కూడా కారణం అని పేర్కొంది. అయితే ఆ రహస్య సాక్షి ఎవరో ఇప్పుడో బహిరంగంగా చెప్పలేం అని కూడా సీబీఐ తెలియజేసింది. ఆ రహస్య సాక్షి.. వైఎస్సార్ తనయ, వైతెపా నాయకురాలు షర్మిల అని నారా లోకేష్ అంటున్నారు. జగన్ సొంత చెల్లెలే ఆ రహస్య సాక్షి అని వినిపిస్తోంది అంటూ నారా లోకేష్ తన సభల్లో చెబుతున్నారు.
రహస్య సాక్షి షర్మిలేనా? కాదా? అనేది తర్వాతి సంగతి. కానీ ఆమె రహస్య సాక్షి అనే విషయం జనం నమ్మితే మాత్రం.. అది జగన్ కు ప్రమాద సంకేతంగా భావించాల్సి ఉంటుంది. వైఎస్ జగన్ కు ఉన్న ప్రజాదరణలో 90 శాతం కేవలం ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి పుణ్యం. రాజశేఖర రెడ్డి మీద భక్తితో జగన్ ను ఆదరించే వారు, వైఎస్సార్ కూతురు షర్మిలను కూడా అంతే ప్రయారిటీతో చూస్తారు. ఆమె మాటలకు కూడా జగన్ కు ఇచ్చినంత విలువే ఇస్తారు. అలాంటి నేపథ్యంలో షర్మిల ఆ కేసులో కీలక సాక్షిగా అవినాష్ రెడ్డి పేరు చెప్పిందనే సంగతి బయటకు వస్తే గనుక.. సీబీఐ చెబుతున్న కథనం మొత్తం నిజంగా తేలుతుంది.
షర్మిలకు లేదా విజయమ్మకు కడప ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా వివేకానందరెడ్డి పట్టుబట్టారని, అందువల్లనే ఆయనను హత్యచేశారని సీబీఐ చెబుతోంది. ఆ తర్వాతి పరిణామాల్లో తల్లీ, చెల్లీ ఇద్దరూ జగన్ కు దూరమైపోయారు కూడా. వీటన్నింటినీ సమన్వయం చేసుకుంటే సీబీఐ ఆరోపణలు నిజమని తేలుతాయి. కడప ఎంపీ టికెట్ దక్కించుకుని గెలిచిన అవినాష్ రెడ్డి పాత్రపై ఇంకా నీలినీడలు ముసురుకుంటాయి.
ఆ రకంగా రహస్యసాక్షి షర్మిల అయిఉంవచ్చుననే ప్రచారాన్ని ముమ్మరం చేయడం ద్వారా.. అవినాష్ మీద అనుమానాలను జనంలో పెంచుతున్నారు లోకేష్.
‘రహస్యసాక్షి’ పేరుతో రచ్చ రచ్చ చేస్తున్న లోకేష్!
Sunday, November 17, 2024