రఘురామక్రిష్ణరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనుంచి గెలిచిన లోక్ సభ ఎంపీ. అయితే, తనకు తన సొంత పార్టీ వారినుంచి ప్రాణాలకు ముప్పు ఉన్నదని, తాను తన నియోజకవర్గంలో అడుగుపెడితేచాలు.. తనను అంతమొందించడానికి సిద్ధంగా ఉన్నారని ఆరోపణలు గుప్పిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా రోజులు నెట్టుకొస్తున్నారు. మహా అయితే అప్పుడప్పుడూ ఢిల్లీనుంచి హైదరాబాదు మాత్రం వచ్చి రాజకీయం నడుపుతూ ఉండే ఈ నాయకుడు, వైసీపీ నుంచి ప్రాణభయంతో కేంద్రానికి మొరపెట్టుకుని వై కేటగిరీ భద్రత కూడా పొందారు.
అలాంటి రఘురామక్రిష్ణరాజు ఇప్పుడు కొత్త అనుమానాలను, కొత్త భయాలను బయటపెడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాణాలకు ముప్పు ఉన్నదని అంటున్నారు. ఆయన పాల్గొంటున్న సభల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, అనపర్తి సభ విషయంలో పోలీసుల దుడుకుతనం వెరసి.. ఇలాంటి భయాలు కలుగుతున్నట్టుగా రఘురామ అంటున్నారు. ఈ మేరకు ఆయన ప్రధాని నరేంద్రమోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖలు కూడా రాశారు. అనపర్తి ఘటనలో చంద్రబాబు వాహనాన్ని ఆపేసిన పోలీసులు, ఆయన కాలినడకన ఏడు కిలోమీటర్లు వెళ్లగా, ఆ మార్గంలో నామమాత్రపు భద్రత కల్పించలేదని, ఇదంతా ఒక వ్యూహం అని రఘురామ ఆరోపిస్తున్నారు.
రఘురామక్రిష్ణ రాజు వ్యక్తం చేస్తున్నది, అతిశయమైన అనుమానం ఎంతమాత్రమూ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. చెప్పుకోవడానికి జడ్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ.. స్థానిక పోలీసుల సహకారం లేకుండా ప్రాణరక్షణ అనేది అసాధ్యం. జడ్ కేటగిరీ భద్రతా దళాలు చంద్రబాబు చుట్టూ దడికట్టి ఆయనకు కొంతమేరకు రక్షణ ఇవ్వగలరు. అదే సమయంలో జనంలోంచి, సమూహంలోంచి ఒక దాడి ప్రయత్నం జరిగితే.. దాన్ని అడ్డుకోవడం కష్టం. గతంలో చంద్రబాబు సభలో ప్రసంగిస్తుండగా ఆయన మీద విసిరిన రాయి భద్రతాసిబ్బందికి తగిలి గాయపడిన సంగతి తెలిసిందే.
అలాంటి దాడి ఈసారి రాయి కాకుండా, ఇంకేదైనా విసిరేలా కూడా జరుగుతుందనే అభిప్రాయాలు, భయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. రాజకీయాలు రాష్ట్రంలో వ్యక్తిగత పగలు, కక్షల స్థాయికి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో పాలక, ప్రతిపక్ష పార్టీల మధ్య వైషమ్యాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలే పోలీసులు ప్రభుత్వానికి ఏజంట్లుగా, పాలక పార్టీకి కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీలో.. చంద్రబాబునాయుడుకు భద్రత నిజంగా ఉన్నదా? అనే భయాలు పలువురిలో కలుగుతున్నాయి. రఘురామ క్రిష్ణరాజు , చంద్రబాబు గురించి వ్యక్తంచేసిన భయాలు నిజమైతే.. రాష్ట్రం అల్లకల్లోలం అవుతుందని అనుకుంటున్నారు.
రఘురామ భయాలు నిజమైతే అల్లకల్లోలమే!
Sunday, November 17, 2024