పుట్టుమచ్చలు తప్ప అన్నీ అడుగుతున్నారు పోలీసులు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం దాకా సాగే పాదయాత్రలో లోకేష్ వెంట ఎవరెవరు నడుస్తారు? ఎవరెవరు పాల్గొంటారు? ఏయే వాహనాలు ఉంటాయి? వాటి నెంబర్లు ఏమిటి? రాత్రుళ్లు ఎక్కడెక్కడ బసచేస్తారు? ఈ వివరాలన్నీ అడుగుతున్నారు పోలీసులు. నారా లోకేష్ పాదయాత్ర మరో అయిదు రోజుల్లో మొదలు కావాల్సి ఉండగా.. ఇప్పటిదాకా దానికి అనుమతుల గురించి అడుగు ముందుకు పడలేదు. మా అనుమతుల సంగతి ఏం చేశారు మహాప్రభో అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మళ్లీ ఓసారి డీజీపీకి లేఖ రాస్తే.. యాత్రకు సంబంధించి ఈ వివరాలన్నీ కావాలంటూ డీజీపీ సమాధానమివ్వడం తాజా అప్డేట్.
ఒక నాయకుడు పాదయాత్ర చేస్తున్నాడంటే.. ఒక చిన్న సమూహం మాత్రమే ఆ పాదయాత్రలో తొలినుంచి చివరి వరకు ఉంటుంది. కానీ.. పాదయాత్ర మొదలైన దగ్గరినుంచి, సాగుతున్న కొద్దీ.. ప్రతి ఊరిలోనూ వందల వేల మంది వచ్చి జత కలుస్తుంటారు. నాయకుడిని అభిమానించేవాళ్లు, పార్టీని అభిమానించే వాళ్లు, నాయకుడు చేస్తున్న పాదయాత్ర ప్రయోజనాన్ని అభిమానించేవాళ్లు రకరకాల వ్యక్తులు జాయిన్ అవుతారు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణం గమనిస్తే.. ఆ పాదయాత్రను విచ్ఛిన్నం చేయాలని, కుట్రపూరితంగా వచ్చి జాయిన్ అయ్యే అవాంఛనీయ కిరాయిశక్తులు కూడా ఉంటారు. నిజానికి ఇలాంటివి నియంత్రించడానికే పోలీసులను భద్రత కోరేది. ఎవరో నిర్దిష్టంగా ఒక బృందం నడుచుకుంటూ కుప్పంనుంచి ఇచ్చాపురం వెళ్లడానికి పోలీసు అనుమతి ఎందుకు? ఇలాంటి అనేకానేక కోణాల్లో పరిణామాలు ఉంటాయి గనుక.. వారు భద్రత చూడాలి గనుక.. వారి అనుమతులు అడగాలి.
మరి పోలీసులు వాహనాల సహా వివరాలన్నీ ముందే తమకు చెప్పాలని అడగడం చిత్రంగా ఉంది. పాదయాత్రకు అనుమతి ఇచ్చే ఉద్దేశం పోలీసులకు లేదు. ఎందుకు తిరస్కరించాలో వారి వద్ద కారణం కూడా లేదు. ఇప్పుడే ఇన్ని వివరాలు కోరుతూ అడ్డుకోడానికి ప్రయత్నిస్తున్న పోలీసులు రేపు పాదయాత్ర మొదలైన తర్వాత మాత్రం ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘన అంటూ ప్రతి ఊరిలోనూ, ప్రతి కిలోమీటరుకూ ఒకసారి అడ్డుకోకుండా ఉంటారనే గ్యారంటీ ఏముంది. మొత్తానికి యువగళం పాదయాత్ర పుణ్యమాన్ని.. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.
యువగళం : నో చెప్పకుండా సన్నాయి నొక్కులు!
Sunday, January 19, 2025