తొక్కి సలాట జరిగే స్థాయిలో చంద్రబాబు నాయుడు సభలకు ప్రజలు హాజరు కావడం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జీర్ణం చేసుకోలేకపోతోంది. తాము విపరీతంగా సంక్షేమ పథకాలు అమలు చేసేస్తున్నామని, ప్రజలు మూకుమ్మడిగా తమకు మాత్రమే ఓట్లు వేసి గెలిపిస్తారని పదేపదే చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు లభిస్తున్న జన స్పందన చూసి అసహనానికి గురవుతున్నారు. ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న సభల్లో కనిపించే ప్రజలకు పథకాలను కోతపెట్టే ప్రయత్నాలు కొన్నిచోట్ల జరుగుతూ ఉన్నప్పటికీ కూడా జనం పట్టించుకోకుండా వస్తుండడం ప్రభుత్వానికి మింగుడు పడడం లేదు. ఈ నేపథ్యంలో జనవరిలో జరగబోయే నారా లోకేష్ పాదయాత్రకు కూడా ఇదే విధమైన స్పందన వస్తే అది తమ పార్టీకి దాదాపుగా మరణశాసనం అవుతుందని వారు భయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సభలను అడ్డుకోవడం ఎలా అనే కోణంలో కుట్రపూరిత కసరత్తు చేస్తున్నారు.
జనవరి 27 నుంచి నారా లోకేష్ పాదయాత్ర మొదలు కాబోతున్న సంగతి తెలిసిందే ఈ పాదయాత్రకు అనుమతులు ఇవ్వడంలో రకరకాల ఆంక్షలు విధించడం ద్వారా పెద్ద స్థాయిలో ప్రజల స్పందన బయటపడకుండా తొక్కేయాలని ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులలో కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఇదేంఖర్మ రాష్ట్రానికి’ సభలు సాధిస్తున్న స్పందన చూసి కార్యకర్తలు శ్రేణులు కొత్త ఉత్సాహంతో ఉన్నారు. రేపు లోకేష్ పాదయాత్ర ప్రారంభం అయిన తర్వాత కూడా వారందరూ ఇదే మాదిరి ఇనుమడించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయిలో పనిచేసే అవకాశం ఉంది. అసలే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత చంద్రబాబు సభలకు జనాన్ని ఇబ్బడి ముబ్బడిగా రప్పిస్తుంటే లోకేష్ పాదయాత్ర మొదలైన తర్వాత ఆ ఊపు ఇంకా పెరుగుతుందనేది అందరి అంచనా. జనం ఎక్కువగా వస్తే, ఆ సంగతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కనిపిస్తే.. తమ పుట్టి మునుగుతుందనేది వైసీపీ నాయకుల భయం.
అందుకే ఎలాంటి ఆంక్షలు విధించడం ద్వారా లోకేష్ పాదయాత్రను తక్కువ చేయగలమనే వ్యూహరచనలో వారు నిమగ్నం అయి ఉన్నారు. కోవిడ్ నిబంధనల కత్తిని బయటకు తీయాలని చూస్తున్నారు. లోకేష్ పాదయాత్ర అంటూ మొదలైతే కొన్ని వందల మంది ఆయనతో పాటు నడిచే అవకాశం ఉంటుంది. ఏ ఊరు వెళ్ళినా స్థానికంగా కొన్ని వేల మంది జత అయి పాదయాత్రలో పాల్గొంటారు. ఇలా జరగకూడదనేది వైసీపీ కోరిక. కొవిడ్ నిబంధనలను అనుసరించి వందకు అంతకంటే తక్కువ మందికి మాత్రమే పాదయాత్రలో అనుమతి ఉండేలా కుదించేయాలని వారి ఆలోచన. కానీ రాష్ట్రంలో వారి కోరికకు తగినంతగా కొవిడ్ ప్రబలిన వాతావరణం లేకపోవడం ఇబ్బందికరంగా భావిస్తున్నారు. కొవిడ్ ముందు జాగ్రత్తల పేరుతో ఆంక్షలు విధించాలా.. లేదా ఇంకేదైనా సాకులు చెప్పి ఆంక్షలు కత్తి దూయాలా అనేది వారికి ఇంకా క్లారిటీ రావడం లేదు. ఏం చేసి అయినా సరే లోకేష్ యాత్ర సక్సెస్ కాకుండా తమవంతు విఘ్నాలను సృష్టించాలనే తాపత్రయం వైఎస్ఆర్ కాంగ్రెస్ లో అడుగడుగునా కనిపిస్తోంది.