ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తూర్పు తీరాన్ని మొత్తం తన గుప్పిటలో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన యనమల రామకృష్ణుడు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా తూర్పు తీరంలోని ప్రధానమైన పోర్టు నగరాల పరిధిలోని ప్రాంతాలు జగన్ బినామీలకు, ఆయనకు చెందిన వ్యక్తుల చేతుల్లోకి వెళ్తున్నాయనేది యనమల ఆరోపణ. సాధారణంగా పోర్టుల నుంచి.. ఎగుమతులు సులభం అవుతాయని భావించి ఆ తీరం పొడవునా పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వచ్చేవారు అత్యధికంగా ఉంటారు. ఆ ప్రాంతాన్నంతా తమ అనధికార కబ్జాలో ఉంచుకోవడం ద్వారా.. అలా ముందుకువచ్చే పారిశ్రామికవేత్తల నుంచి అనుచితమైన లాభాలను పొందుతున్నారనేది యనమల రామకృష్ణుడు వేస్తున్న నింద! ఒక ప్రణాళిక ప్రకారంగా తూర్పు తీరం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారనేది ఆయన ఆరోపణ.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత పొడవైన తీర ప్రాంతం ఉంది. గుజరాత్ కంటే కూడా అతి పెద్ద తీరం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికీకరణకు ఎంతో అనువైన ప్రాంతంగా పేరు తెచ్చుకుంది. పైగా బందరు, గన్నవరం, విశాఖ, కృష్ణపట్నంలలో కోర్టులు కూడా ఎగుమతులకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఆ నేపథ్యంలో ఈ తీరం పొడవునా తమ బినామీల ద్వారా ముందే భూములు సేకరించి పెట్టుకుని.. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి వాటా ఇస్తే తప్ప భూములు ఇవ్వం అంటూ నిబంధనలు విధించడం జరుగుతోందని యనమల ఆరోపిస్తున్నారు.
అయితే యనమల చెబుతున్న ఆరోపణ కేవలం వ్యాపార కోణంలో మాత్రమే ఉంది. కానీ తీరం పొడవునా వ్యవహారాలను గుప్పిట పెట్టుకోవడం అంటే.. అది దేశ భద్రతకు కూడా అతి పెద్ద ప్రమాదం. తీర ప్రాంతాలకు శత్రు దేశాల నుంచి ఎప్పటికీ ప్రమాదం పొంచి ఉంటుంది. పైగా తూర్పు తీరం అనేది మనకు చాలా కీలకమైన వ్యవహారం. శ్రీలంకలో కూడా నావల్ బేస్ కలిగిఉన్న చైనా మనకు ప్రధాన శత్రుదేశాల్లో ఒకటి అనే సంగతి అందరికీ తెలుసు.
తూర్పు తీరం దేశరక్షణకు కీలకం గనుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నావికా బలగాలకు ప్రధాన కేంద్రంగా విశాఖపట్నం ఉంది. తీర ప్రాంతంలో ఉండే పరిశ్రమలు, ప్రధానమైన వ్యవస్థలు అంతా ఒక వ్యక్తి కనుసన్నలలో.. ఒక సమూహం గుప్పిటలో ఉంటే గనుక ఏనాటికైనా అది దేశానికే చేటు అవుతుంది. యనమల ఆరోపణ చూసిన ప్రజలకు ఇలాంటి అదనపు భయాలు కూడా కలుగుతున్నాయి. మరి కేంద్ర ప్రభుత్వ నిఘాబలగాలు ఈ దిశగా తమ చూపు సారిస్తాయో, లేదో వేచి చూడాలి.