వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని.. తాజా వ్యాఖ్యలు ఒక కొత్త సంచలనాన్ని నమోదు చేస్తున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని నరేంద్రమోడీని కలిసే ఏ సందర్భం తారసపడినా సరే.. ఆయన కాళ్లు మొక్కి మరీ తన భక్తి ప్రపత్తులను చాటుకోవడానికి ఆరాటపడుతుంటారు. కేంద్రం ఏ ఆలోచన చేస్తున్నా దానికి తన ఎంపీలతో బేషరతుగా మద్దతు ఇవ్వడానికి ఉబలాటపడుతుంటారు. అలాంటి జగన్ కు , మోడీకి మధ్య చిచ్చు రగిలించేలా కొడాలి నాని తాజా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.
జగన్ తాను త్వరలో విశాఖకు నివాసం మార్చేస్తున్నానని ఢిల్లీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ప్రకటించిన నాటినుంచి వైసీపీ దళాలన్నీ మూడు రాజధానుల కాన్సెప్టును సమర్థిస్తూ మళ్లీ కొత్తగా ప్రకటనలు చేయడానికి ఉత్సాహపడుతున్నారు. ఈ క్రమంలోనే కొడాలినాని కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈసారి మూడు రాజధానుల బిల్లును కేంద్రంతోనే పార్లమెంటులోనే పెట్టిస్తాం అని ఆయన సెలవిచ్చారు.
వైసీపీ దళాలు ఎలాగైనా ప్రజలను మభ్యపెడుతుండవచ్చుగానీ.. మూడు రాజధానులు అనేది అంత సులువుగా జరిగిపోయే వ్యవహారం కాదు. ప్రస్తుతం అది సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వానికి అసాధ్యం. ఈ నేపథ్యంలో కొడాలి మాట్లాడుతూ.. కేంద్రంలో మూడు రాజధానులకు అనుకూలంగా ఉండే పార్టీకి మాత్రమే తాము మద్దతు ఇస్తాం అని అంటున్నారు. కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి వారితోనే బిల్లు పెట్టిస్తాం అని అంటున్నారు.
అయితే వాస్తవంలో కేంద్రంలోని మోడీ సర్కారు అమరావతి రాజధానికే అనుకూలంగా ఉంది. అమరావతి మాత్రమే రాజధాని అనేది భాజపా విధాన నిర్ణయంగా ఎన్నడో తీసుకుంది. మధ్యలో రాష్ట్ర పార్టీ నాయకులు రకరకాల చిన్నెలు ప్రదర్శిస్తే.. కేంద్రమంత్రి అమిత్ షా వారికి తలంటడం కూడా జరిగింది. ఒకసారి పార్టీ విధాని నిర్ణయం తీసుకున్న తరువాత.. దానికి కట్టుబడి ఉండాల్సిందేనని హితవు చెప్పడమూ జరిగింది. ఇలాంటి నేపథ్యంలో.. అమరావతి రాజధాని అనే మాటనుంచి బిజెపి వెనక్కు మళ్లుతుందని అనుకోవడం భ్రమ. అలాంటి మడమ తిప్పే వైఖరిని, వైసీపీ కోసం వారు చూపించకపోవచ్చు.
మరి కొడాలి నాని మాటల అర్థం ఏమిటి? కేంద్రంలో ఇంకేదైనా పార్టీ మూడురాజధానుల మద్దతు ఇస్తాం అంటే.. వారికి జైకొడతారా? వారి నేతృత్యంలో మోడీకి ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడడానికి వైసీపీ పావులు కదుపుతుందా? అసలే మోడీ సర్కారును కూల్చడానికి కేసీఆర్ కంకణం కట్టుకుని పనిచేస్తున్న సమయంలో.. కేసీఆర్ తో ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్న జగన్మోహన్ రెడ్డి చాటుమాటుగా.. మోడీ సర్కారును కూలదోసే వారిని, తాను చెప్పే మూడు రాజధానులకు జై కొట్టే వారిని కేంద్రంలో అధికారంలోకి తేవాలని జగన్ ఉత్సాహపడుతున్నారా? అనే అభిప్రాయం కొడాలి నాని మాటల వల్ల ప్రజలకు కలుగుతోంది.
మోడీకి జగన్ కు మధ్య కొడాలి చిచ్చు పెడుతున్నారా?
Monday, December 23, 2024