మొగ్గ దశకే దిక్కులేదు.. అంత పని చేస్తారా?

Thursday, December 19, 2024

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యావ్యవస్థలో మాతృభాషకు ప్రాధాన్యం అట్టడుగు స్థాయికి పడిపోయింది.   రాష్ట్రంలోని పాఠశాలలు అన్నింటిలో కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే కొనసాగించేలా,  మధ్యలో జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.  ఆ వ్యవహారం కోర్టులో పడి ప్రస్తుతానికి రికార్డుల ప్రకారం రెండు భాషల మీడియంలు నడుస్తున్నాయి.   ఇలాంటి నేపథ్యంలో, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఉన్నత విద్యను కూడా మాతృభాషలో బోధించాలని,  దానికి తగినట్లుగా ఉన్నత విద్యా సబ్జెక్టు పాఠాలు అన్నిటిని నిపుణులతో మాతృభాషలోకి అనువదింపజేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్  ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.  ఈ మేరకు యూజీసీ రాష్ట్రానికి కొత్తగా గవర్నరుగా నియమితులైన  సుప్రీం మాజీ న్యాయమూర్తి అబ్దుల్ నజీర్ కు ఒక లేఖ రాసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాతృభాషలో విద్యాబోధన విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది.  కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం కేవలం బోధనలు మాత్రమే కాకుండా బోధనోపకరణాలన్నీ కూడా మాతృభాషలో అందుబాటులో ఉంచాలని ఆదేశం.  అయితే ఏపీ పరిధిలో ఈ మాతృభాషలో విద్యాబోధన అనే అంశానికి ప్రాధాన్యం దక్కడం లేదు. . ప్రాథమిక విద్యాభ్యాసం దశలోనే కేవలం ఇంగ్లీష్ మీడియాన్ని బలవంతంగా రుద్దుతున్న నేపథ్యంలో ఉన్నత విద్యకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు అన్ని మాతృభాషలో ప్రచురించేలా  చర్యలు తీసుకోవాలని యూజీసీ ఆదేశిస్తే,  దానిని పట్టించుకునేది ఎవరు అనే చర్చ రేకెత్తుతుంది.

ప్రత్యేకించి ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలోనే కొనసాగడం వలన..  విద్యార్థులకు గ్రహణ శక్తి పెరుగుతుందని అంతర్జాతీయ స్థాయిలో జరిగిన ఆధ్యాయనాలు  చెబుతున్నాయి. జగన్ సర్కారు ఇంగ్లిషు మీడియం నిర్ణయం తీసుకున్న్నప్పుడు, తెలుగు భాష పరిరక్షణ కోసం ఉద్యమించే అనేకానేక సంఘాలు దీనిని వ్యతిరేకించాయి. పోరాటాలు చేశాయి. ఉపాధ్యాయులనుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం అయింది. అయితే  వాటన్నింటినీ సర్కారు తోసిపుచ్చింది. టెక్నికల్ గా కోర్టు చిక్కులను తప్పించుకోవడానికి పుస్తకాలను రెండు భాషల్లోను ముద్రిస్తూ కేవలం ఇంగ్లిషు మీడియాన్ని మాత్రమే ప్రోత్సహిస్తోంది. మొగ్గదశలోనే అమ్మభాషకు దిక్కులేని పరిస్థితి ఉండగా, ఉన్నత విద్య మొత్తం మాతృభాషలో చెప్పేలా చూడాలనే ప్రతిపాదనకు ఏమాత్రం మన్నన దక్కుతుందో అనుమానమే. 

అబ్దుల్ నజీర్ ఇంకా రాష్ట్ర గవర్నరుగా బాధ్యతలు స్వీకరించనే లేదు. యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ నుంచి ఆయనకు ఈ లేఖ అందింది. గవర్నరుగా తన ఎదటకు వచ్చిన తొలి ప్రతిపాదనను  ఆచరణలో పెట్టే విషయంలో నజీర్ ఎలా స్పందిస్తారు? అమ్మ భాషకు న్యాయం చేస్తారా? తదనుగుణమైన ఆదేశాలతో ప్రభుత్వంలో కదలిక తెస్తారా? యూజీసీ అన్నట్లుగా ఉన్నత విద్య మాత్రమే కాదు, ప్రాథమిక విద్యభ్యాసం ఎక్కువగా మాతృభాషలో జరిగే వాతావరణాన్ని ప్రోత్సహిస్తారా? అనే చర్చ ఇప్పుడు సాగుతోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles