తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘమైన అనుబంధం ఉన్న కోడెల శివప్రసాద్ లాంటి సీనియర్ నాయకుడి వారసుడిగా.. కోడెల శివరామ్ కు పార్టీ పట్ల అన్నింటికంటె ముఖ్యంగా విధేయత ఉండాలి. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే.. దానికి బేషరతుగా సహకరించి, మద్దతిచ్చే వైఖరిని ఆయన అలవాటు చేసుకుని ఉండాలి. కానీ ప్రస్తుతం అలా జరగలేదు. కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన సత్తెనపల్లి నియోజకవర్గానికి చంద్రబాబునాయుడు తాజాగా కన్నా లక్ష్మీనారాయణను ఇన్చార్జిగా ప్రకటించేసరికి శివరామ్ చాలా బాధపడిపోయారు. తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఇలాంటి సంక్షోభాలను తన సుదీర్ఘ రాజకీయజీవితంలో ఎన్నెన్నో చూసి ఉన్న చంద్రబాబునాయుడు, రెచ్చిపోకుండా, తిరుగుబాటును అణిచేయాలనే దూకుడు తత్వంతో కాకుండా.. శివరామ్ కు వాస్తవాలను తెలియజెప్పేందుకు జీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు లను పురమాయించి పంపారు.
సత్తెనపల్లి వచ్చి శివరామ్ ఇంట్లో ఆయనతో సమావేశమైన ఈ నాయకులు.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని, పార్టీ విజయం కోసం మనస్ఫూర్తిగా పనిచేయాలని ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా శివరాం అనుచరులు కాస్త రాద్ధాంతం చేసినప్పటికీ.. వారు సంయమనం పాటించడం విశేషం.
భేటీ తర్వాత ఈ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కోడెల శివరామ్ కు పార్టీ న్యాయం చేస్తుందని, కొన్నిరోజుల్లోగా చంద్రబాబు స్వయంగా ఆయనను పిలిపించి మాట్లాడతారని చెప్పారు. చంద్రబాబు- శివరామ్ ను తన సొంత కుటుంబసభ్యుడిగా భావిస్తారని కూడా హామీ ఇచ్చారు.
అయితే ఈ భేటీలో సత్తెనపల్లి నియోజకవర్గంలో పార్టీ పలుదఫాలుగా చేయించిన సర్వేల నివేదికలను కూడా శివరామ్ కు చూపించి ఆ నాయకులు వాస్తవాల్ని వివరించినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలుగుదేశం కొంత కాలంగా.. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయిస్తోంది. సత్తెనపల్లి పరిధిలో ప్రతి సర్వే కూడా శివరామ్ కు ప్రతికూలంగానే వచ్చినట్టు సమాచారం. ఆ నివేదికల ఆధారంగానే కన్నాకు ఇన్చార్జి పదవి ఇచ్చినట్టుగా వారు శివరామ్ కు వివరించారు.
శివరాం పార్టీ టికెట్ ఇచ్చినాసరే గెలిచే అవకాశం లేదని, అలాంటిది ఆవేశపడి ఇండిపెండెంటుగా పోటీచేస్తే.. పార్టీకి కూడా దూరమై కెరీర్ మొత్తం నాశనం అవుతుందని వారు హెచ్చరించినట్లు సమాచారం. పార్టీలోనే ఉంటే.. కనీసం ఎమ్మెల్సీ అవకాశాలుంటాయని వారు నచ్చజెప్పినట్టుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మెత్తబడకపోతే కోడెల శివరామ్‌కే చేటు!
Sunday, December 22, 2024