‘మూడు రాజధానులు’ ఎన్నికల తర్వాతే! 

Tuesday, November 12, 2024

రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ చేస్తామని,  తద్వారా మూడు ప్రాంతాలను కూడా సమానంగా అద్భుతంగా అభివృద్ధి చేస్తామని,  జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాటలు చెబుతూ ఉండవచ్చు గాక!   ఆ ముసుగులో, అమరావతిని నాశనం చేసి రాజధానిని విశాఖకు తరలించాలనే  వారి సంకల్పం ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదు.  మూడు రాజధానులు అనే  ఎజెండాతోనే  జగన్మోహన్ రెడ్డి సర్కారు ఎన్నికలను ఎదుర్కోవాల్సిన తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతోంది.  విశాఖ ఒక్కటే రాజధాని..  కర్నూలులో కేవలం ఒక హైకోర్టు బెంచ్ ఉంటుంది అలాగే గుంటూరులో ఒక సెషన్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం అని అంటూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ  రెడ్డి రాజేసిన వివాదం నేపథ్యంలో..  సకల శాఖ మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి  వివరణ ఇవ్వడానికి చేసిన ప్రయత్నం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

రాజధానిని గాని, ముఖ్యమంత్రి కార్యాలయాన్ని గాని విశాఖకు తరలించడం అనేది సుప్రీం కోర్టు తీర్పుకు లోబడి మాత్రమే ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తాము అనే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. అమరావతి కేసు విషయంలో రాష్ట్ర హైకోర్టు చాలా స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రస్తుతం సుప్రీంకోర్టులో దావా నడుపుతోంది. తమ ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నదని,  అధికార వికేంద్రీకరణ చేసి తీరుతామని ప్రకటిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి.. అదే సమయంలో మూడు రాజధానుల ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తాం అని పేర్కొనడం చాలా కీలకమైన అంశం!  అంటే ఎన్నికలు ముగిసేలాగా రాజధానిని విశాఖకు తరలించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని,  అది సాధ్యం కాదు అనే అవగాహన వారికి ఏర్పడిందని అనుకోవాల్సి వస్తోంది.

మూడు రాజధానుల కాన్సెప్ట్ తో  రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని.. మూడు ప్రాంతాల సమాన అభివృద్ధి అనేది ఒక బూటకం అని ప్రజల నెమ్మదిగా గుర్తిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ దళాలు భూదందా కొనసాగించడానికి మాత్రమే విశాఖ రాజధాని అనే ప్రహసనాన్ని నడిపిస్తున్నారని ప్రతిపక్షాలు తొలినుంచి విరుచుకుపడుతున్నాయి.  విశాఖ ప్రాంతంలో రోజుకొకటిగా వెలుగు చూస్తున్న అధికార పార్టీ నాయకుల భూ అక్రమాలు ఇలాంటి ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దానికి తోడు ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి సీనియర్ మంత్రులు విశాఖలో ఉండేది మాత్రమే పూర్తిస్థాయి రాజధాని అని,  గుంటూరు, కర్నూలు లలో  ఏదైతే శాసన, న్యాయ రాజధానులను ప్రతిపాదిస్తున్నారో అవన్నీ తూతూ మంత్రంగా చెబుతున్నవేనని ప్రజలకు స్పష్టత ఇస్తున్నారు.  అమరావతి ప్రాంతంలో మూడు రాజధానులు కాన్సెప్ట్ పట్ల ప్రజా వ్యతిరేకత తారస్థాయిలో ఉండగా.. కర్నూలుకు న్యాయ రాజధాని రూపేణా జరగగల అభివృద్ధి నామమాత్రంగా ఉంటుందనే స్పృహ  ఆ ప్రాంతం వారికి కూడా పెరుగుతోంది.  మూడు రాజధానులు– అధికార వికేంద్రీకరణ అనే మాటలు జగన్ ప్రభుత్వం గారడీ ప్రదర్శన మాత్రమే అని ప్రజలు గుర్తిస్తున్నారు. . రాయలసీమ ప్రాంతంలో చైతన్యం పెరుగుతుంది.  అలాంటప్పుడు ఎన్నికలకు వెళితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఫలితాలను సాధిస్తుంది? అనేది సందేహమే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles