ముస్తఫ్ఫా.. ముస్తఫ్ఫా.. ఈ కోపం ఏమిటి ముస్తఫ్ఫా!

Sunday, November 17, 2024

గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫా కు జనం మీద కోపం వస్తోంది. సాధారణంగా అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యేలకు ఎవరిమీదనైనా కోపం వస్తే వారి మీద పోలీసు కేసులు పెట్టిస్తారు. వారిని కొంత ఇబ్బంది పెట్టి, ఆరూపంలో భయపెట్టి తర్వాత మిన్నకుండి పోతారు. ఒకరిద్దరి మీద కోపం అయితే ఇలా కేసులు పెట్టించవచ్చు. కానీ, ఒక ఊరిప్రజల మీద, ఒక కాలనీ ప్రజల మీద మూకుమ్మడిగా కోపం వస్తే ఏం చేస్తారు? ఏం చేయాలో.. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే ముస్తఫానే అడగాలి.
ఆయన ఎంచక్కా జనానికి శాపనార్థాలు పెడుతున్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవారి జీవితాలను తాను ఒక బిడ్డలాగా బాగు చేసేస్తున్నానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదేపదే చెబుతుండగా.. ఇటు ఆయన పార్టీ ఎమ్మెల్యే మాత్రం, జనాన్ని మీరు నాశనమైపోతారు అంటూ శాపనార్థాలు పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. నాయకుడనేవాడు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల బాగుకోరాలి, అది చేతకాకపోయినా పర్లేదు కానీ నాశనమైపోవాలని శపించడం ఏమిటి? అని జనం విస్తుపోతున్నారు.
ఇంతకూ ఎమ్మెల్యే ముస్తఫాకు జనం మీద అంత కోపం ఎందుకు వచ్చింది?
పాత గుంటూరులోని బ్రహ్మంగారి గుడి వీధిలో మురుగు కాల్వల నిర్మాణానికి ఎమ్మెల్యే ముస్తఫా శంకుస్థాపన చేయాలని అనుకున్నారు. అసలే అది పాత గుంటూరు. అక్కడి వీధులన్నీ చాలా చిన్నవిగా ఇరుకిరుగ్గా ఉంటాయి. అసలే ఇరుగ్గా ఉండే వీధుల్లో రెండువైపులా మురుగుకాల్వల పేరిట కాస్త కబ్జా అయిపోతే ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుందని జనం భయపడ్డారు. తమ వీధుల్లో భూగర్భ డ్రైనేజీ వేయించాలని ఎమ్మెల్యేను కోరారు.
అలా కోరడం వెనుక ప్రజల ఉద్దేశం ఇంకోటి కూడా ఉంది. గుంటూరు నగర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేయించారు. అప్పట్లో మిగిలిపోయిన ప్రాంతాల్లో ఈ వీధి కూడా ఒకటి. ఊరంతా భూగర్భంలో ఉండగా.. తమ వీధిలో మాత్రం సైడు కాలువలు ఎందుకు అనే భావన వారికి ఉండొచ్చు.
అయితే ఎమ్మెల్యే ఆత్రం వేరు. భూగర్భ డ్రైనేజీ ఇప్పట్లో అయ్యేది కాదు. కాలువలు వేయించేస్తే.. ఏదో పనిచేసినట్టుగా బిల్డప్ ఉంటుంది అనుకున్నారు. ఎన్నికలకు ముందు ఈ డ్రామాలన్నీ ఎందుకంటూ జనం ఆయనను గట్టిగానే నిలదీశారు. దీంతో ఎమ్మెల్యే ముస్తఫా జనంపై గుడ్లురిమి.. శాపనార్థాలకు దిగారు. మీరు నాశనమైపోతారు అని తిట్టేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles