రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీ నాయకుల ఇమేజిని దెబ్బతీయడానికి విమర్శలు చేయడం చాలా సహజం. అవసరం కూడా. అయితే రాజకీయ విమర్శలు ఎప్పుడూ కూడా విధానాలు ప్రాతిపదికగా ఉండాలి. వారి విధానాలు ప్రజలకు ఎలా మంచివి కావో.. తమ విధానాలు ఎలా మేలుచేస్తాయో చెప్పుకుని విజయం సాధించాలి. కానీ వర్తమాన రాజకీయంలో పరిస్థితి అంతా అదుపు తప్పి పోయింది. వ్యక్తిగత విమర్శలు చాలా మామూలు అయిపోయాయి. ప్రత్యర్థి పార్టీ నాయకుల వ్యక్తిగత, కుటుంబ విషయాల గురించి విమర్శలు సంధిస్తూ తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు పరిణామాలను చూస్తోంటే.. ఈ విమర్శలు ఇంకాస్త దిగజారినట్టుగా కనిపిస్తోంది. ఎంతో చీప్‌గా, నిజానికి నేరంగా పరిగణించే బాడీషేమింగ్ తరహా విమర్శలు అనివార్యంగా వచ్చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ కార్యక్రమానికి హాజరైన మహిళలను ఉద్దేశించి సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకోసం ఏయే పథకాలు చేపడుతున్నదో, ఎంత డబ్బు పంచిపెడుతున్నదో గణాంకాలన్నీ వివరించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ మీద నిందలు కూడా నిప్పుల్లా కురిపించారు. వారికి ఉన్నట్టుగా తనకు మీడియా, దత్తపుత్రుడి సపోర్టు లేదని కేవలం దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని అన్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. చంద్రబాబునాయుడు తన పరిపాలన హయాంలో ప్రజలకు, మహిళలకు ఏమీ చేయలేకపోయాడు అని చెప్పడానికి జగన్ పడిన తాపత్రయం మరొక ఎత్తు. తన ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను అప్పట్లో చంద్రబాబు ఎందుకు చేయలేదో అడగాలని పిలుపు ఇచ్చారు.
ఈ సందర్భంగా చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చిన ప్రతిసారీ ముసలాయన, ముసలాయన అంటూ ఎద్దేవా చేస్తూ మాట్లాడడం చాలా చీప్ పొలిటిల్ ట్రిక్ గా ప్రజలు భావిస్తున్నారు.
వయస్సు అనేది దాచిపెడితే దాగేది కాదు. తనకు ముసలితనం వచ్చిన సంగతిని చంద్రబాబు కూడా ఒప్పుకుంటారు. కానీ, ఆయనలో ప్రత్యేకమైన గుణం ఫిట్ నెస్. ఈ వయసులో కూడా ఆయన ఫిట్ నెస్ ప్రజల మధ్య తిరుగుతున్నప్పుడు ఆయన తీరు, పట్టుదల చాలా గొప్పగా అనిపిస్తాయి. ఆయన వెంట చాలా మంది యువనాయకులు కూడా నడవలేని పరిస్థితి ఉంటుంది. అయినా ఫిట్నెస్ సంగతి పక్కన పెట్టినా.. ముసలాయన అంటూ తన రాజకీయ ప్రత్యర్థిని పదేపదే అనడం బాడీ షేమింగ్ లాగానే ఉన్నదని పలువురు అంటున్నారు. సీఎం స్థాయిలోని జగన్ వంటి వ్యక్తికి ఇది తగదని అంటున్నారు.
శారీరకమైన అవకరాలు, లోపాలు కొందరికి ఉంటాయి. వాటిని ఉద్దేశించి ఎద్దేవా చేయడం అనేది చాలా హేయం. ముసలితనం కూడా అలాంటిదే. అయినా.. 2024 ఎన్నికల్లో గెలిస్తే.. ఆతర్వాత మరో ముప్పయ్యేళ్లు తానే ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తానని చెప్పుకుంటూ ఉన్న జగన్మోహన్ రెడ్డి, ఆ దశ వచ్చేసరికి ఇప్పుడు చంద్రబాబునాయుడు కంటె ఎక్కువ ముసలివాడు అవతాడనే సంగతి ఆయన తెలుసుకోవాలి. చంద్రబాబునాయుడు విధానాలను ఎన్ని రకాలుగా అయినా విమర్శించవచ్చు గానీ.. బాడీ షేమింగ్ లాగా ముసలాయన అంటూ లేకిగా మాట్లాడడం జగన్ ను అభిమానించే వారికి కూడా చీదర పుట్టిస్తుంది.
‘ముసలాయన’.. ఎద్దేవా చేయడమే జగన్ విజ్ఞతా!
Wednesday, January 22, 2025