కాపు సామాజిక వర్గానికి చెందిఉండడమే తన క్వాలిఫికేషన్ గా నిత్యం ప్రచారం చేసుకుంటూ ఉండే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కాపులకు మాయమాటలు చెప్పడం, వారికి బిస్కట్లు వేయడం, కాపు కులానికి చెందిన వారిని కూడా తన కేబినెట్లోకి తీసుకుని, పవన్ కల్యాణ్ మీద విరుచుకుపడడానికి వారిని నిత్యం ఉసిగొల్పుతూ ఉండడం తప్ప నిర్దిష్టంగా వారి సంక్షేమం కోసం ఎన్నడూ దృష్టి పెట్టని జగన్మోహన్ రెడ్డి ఏరకంగా ఇవాళ ముద్రగడ పద్మనాభం కు ఆరాధ్య నాయకుడిగా కనిపిస్తున్నారో అర్థం కావడం లేదు. కాపులను బీసీల్లో చేర్చడం కోసమే తాను బతికి ఉన్నట్టుగా, బీసీల్లో చేర్చడం కోసమే ప్రాణాలను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు ఆ డిమాండ్లన్నిటినీ చాలా కన్వీనియెంట్ గా మరచిపోయినట్లు కనిపిస్తోంది.
కాపుల కోసం బీసీల్లో చేర్చాలనే డిమాండ్ ను పక్కన పెట్టేసి.. కేవలం డీల్ మాత్రం మాట్లాడుకుని ముద్రగడ పద్మనాభం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రెడీ అయిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈనెల 14వ తేదీన తన స్వగ్రామంనుంచి ఊరేగింపుగా బయల్దేరి వెళ్లి.. జగన్ సమక్షంలో సాయంత్రం నాలుగు గంటల తర్వాత పార్టీలో చేరబోతున్నట్టుగా ముద్రగడ ప్రకటించారు. అయితే ఆయన మాటల్లో ఎక్కడా కూడా.. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ కనిపించనే లేదు. డీల్ ను మాత్రం చాలా స్పష్టంగానే చెప్పారు.
జగన్ కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని, రాష్ట్రమంతా తిరిగి వైఎస్సార్ కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తానని కూడా అంటున్న ముద్రగడ.. చేరిక కోసం తాను ఎలాంటి షరతులు పెట్టలేదని, సీట్లు అడగలేదని సమర్థించుకుంటున్నారు. అదేసమయంలో పార్టీ గెలిచిన తర్వాత.. తనకు జగన్ ఏ పదవి ఇస్తే అది తీసుకుంటానంటూ.. పదవి ఏదో ఒకటి కావాలని ముందే బహిరంగ సంకేతాలు కూడా ఇస్తున్నారు. కర్ణాకర్ణిగా వినిపిస్తున్న సమాచారాన్ని బట్టి.. తనకు రాజ్యసభ ఎంపీ పదవి, తన కొడుకు గిరికి ఎమ్మెల్సీ పదవి డీల్ గా మాట్లాడుకుని ముద్రగడ వైసీపీలో చేరుతున్నట్టుగా తెలుస్తోంది.
కాపులను బీసీల్లో చేర్చడం అనేది జీవితలక్ష్క్ష్యం అని చెప్పుకున్న మనిషి.. కనీసం ఆ ప్రస్తావన కూడా లేకుండా జగన్ కోటరీలో చేరిపోతే.. ఆయన ఆ కులం వారిలో గౌరవం మిగిలి ఉంటుందా? ఆయన మాటకు వారు విలువ ఇస్తారా? అనేది ఇప్పుడు సందేహంగా ఉంది.
ముద్రగడ: డిమాండ్ పక్కన పెట్టి.. డీల్ కు ఓకే!
Thursday, December 26, 2024