చంద్రబాబునాయుడు వ్యూహరచనలో, ఎడ్మినిస్ట్రేషన్ లో పరిణతి ఉన్న నాయకుడు. అటు పార్టీ అయినా, ఇటు ప్రభుత్వం అయినా చక్కగా నడిపించగలరనే పేరున్న నాయకుడు. ఇప్పుడు తెలుగుదేశాన్ని ఆయన ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ నాయకులకు, నియోజకవర్గాల ఇన్చార్జిలకు దిశానిర్దేశం చేస్తున్నారు. అందులో భాగంగా.. పార్టీ నియోజకవర్గ పరిశీలకులతో చంద్రబాబు కేంద్ర కార్యాలయంలో ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు.
పార్టీ నాయకులు కనీసం నెలలో ఎనిమిది రోజుల పాటూ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉండాలని, నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తుండాలని ఆయన మార్గదర్కశనం చేశారు. ప్రతి రెండువారాలకు ఒకసారి రాష్ట్రస్థాయిలో అన్ని నియోజకవర్గాల పరిస్థితులను సమీక్షిస్తుండాలని కూడా సూచించారు. నియోజకవర్గ ఇన్చార్జిలనుంచి క్షేత్రస్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ కూడా.. పార్టీ తొలివిడత మేనిఫెస్టో గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం, ఆ పథకాల గురించి రాష్ట్రంలోని ప్రతి మహిళకు తెలిసేలా, వారిలో సానుకూలత వచ్చేలా తెలియజెప్పడం గురించి పనిచేయాలని కూడా అన్నారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి గానీ.. చాలా నియోజకవర్గాల్లో ఉండే గ్రూపు తగాదాల విషయంలో ఆయన సూచనే అంత ఆమోదయోగ్యంగా లేదని పార్టీ వారే అంటున్నారు.
ఏ పార్టీలో అయినా.. నియోజకవర్గస్థాయిలో గ్రూపులు ఉండడం.. అవి పార్టీకి చాలా సార్లు నష్టదాయకంగా మారుతుండడం సహజం. వారిని సమన్వయపరచినిప్పుడే నాయకత్వం.. పార్టీని గెలుపుబాటలో నడిపించగలుగుతుంది. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తుందని పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్న తరుణంలో నియోజకవర్గాల్లో ముఠాల మద్య వైరం మరింతగా ప్రబలుతోంది. ఎక్కడికక్కడ వీటిని సద్దుమణిగేలా చేయాల్సిన బాధ్య నాయకుడిదే. అయితే చంద్రబాబు.. ఈ సమీక్ష సమావేశంలో.. నియోజకవర్గాల వర్గ విభేదాలను వారిస్థాయిలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. వారే మాట్లాడి సెటిల్ చేసుకోవడం వలన ఫలితం ఎక్కవ ఉంటుందని ఆయన అనుకోవచ్చు గానీ.. అలాంటివి జరిగే అవకాశం చాలా తక్కువ. అధినేత స్వయంగా పూనుకుని ఏ ఒక్కచోట కూడా వర్గ విభేదాలు లేకుండా చేయలగలిగినప్పుడు మాత్రమే పార్టీ విజయపథాన ఉంటుంది. ఈ విషయం తమ నాయకుడు గుర్తించాలని, విబేదాలను సర్ది చెప్పడానికి కీలక నియోజకవర్గాల్లో అయినా చంద్రబాబు స్వయంగా పూనుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.
ముఠాతగాదాలపై చంద్రధోరణి కరక్టేనా?
Sunday, December 22, 2024