దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలకు ఇంకా ఏడాది దూరం ఉంది. ఇప్పుడే జనం నాడిని అంచనా వేయడం అంటే తొందరపాటు అనిపించుకుంటుంది. ఎందుకంటే ఏడాది కాలవ్యవధిలో ఎన్ని పరిణామాలైనా జరిగే అవకాశం ఉంటుంది. బండ్లు ఓడలు కావచ్చు ఓడలు బండ్లు కావచ్చు!! రాజకీయంగా పార్టీల మధ్య హోరాహోరీ పోరు, సంక్లిష్ట పరిస్థితులు ఉండగా ఏడాదికి ముందే సర్వే చేసి ఎవరికీ ఎన్ని సీట్లు దక్కుతాయో తేల్చి చెప్పడం అనేది కామెడీగా అనిపిస్తుంది. అలాంటి కామెడీని జాతీయ స్థాయి మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ దేశ ప్రజల ముందు ప్రదర్శించింది.
టైమ్స్ నౌ నవభారత్ వారి సర్వేలో ఏకపక్షంగా భారతీయ జనతా పార్టీకి తిరుగులేని అధికారం కట్టబెట్టారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో నిమిత్తం లేకుండా భారతీయ జనతా పార్టీ సొంతంగా 285 నుంచి 325 స్థానాలు గెలుచుకుంటుందని ఈ సర్వే వెల్లడించింది. ఈ సర్వే గణాంకాలు నిజంగా తేలితే గనుక ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల యావత్ భారతదేశం అప్రతిహతంగా నీరాజనాలు పడుతున్నట్టే లెక్క!
ఇదే సంస్థ రాష్ట్రాల వారీగా ఏయే పార్టీలకి ఎన్ని సీట్లు దక్కుతాయి అనే అంచనాలను కూడా వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల పరిస్థితులను పరిశీలిస్తే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 24 నుంచి 25 సీట్లు దక్కుతాయని, ప్రతిపక్ష తెలుగుదేశానికి కేవలం సున్న నుంచి ఒక్క సీటు మాత్రమే లభిస్తుందని వారు అంచనా వేశారు. బిజెపి జనసేన తదితర పార్టీలు బోణీ కొట్టే అవకాశం కూడా లేదన్నమాట. తెలంగాణ గణాంకాలను పరిశీలిస్తే మొత్తం 17 సీట్లు ఉన్న తెలంగాణలో భారత రాష్ట్ర సమితికి 9 నుంచి 11 సీట్లు, భారతీయ జనతా పార్టీకి మూడు నుంచి ఐదు సీట్లు, కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే లభిస్తాయి అనేది టైమ్స్ నౌ నవభారత్ వారి లెక్క. ఇక్కడ మరీ చిత్రంగా కనిపిస్తున్న పరిణామం ఏంటంటే.. హైదరాబాదు లోక్సభ స్థానాన్ని సాధారణంగా ఎంఐఎం ఏకపక్షంగా ప్రతిసారీ గెలుచుకుంటూ ఉంటుంది. కానీ వీరి సర్వేలో మాత్రం ఆ సంగతి ప్రస్తావన కూడా లేదు. ఇతరులు అందరికీ కలివి సున్న స్థానాలు దక్కుతాయని వారు ప్రకటించారు.
ఏడాదికి ముందే ఎన్నికల సర్వే చేసి ఎవరు అధికారంలోకి వస్తారు చెప్పిన తీరును గమనిస్తుంటే.. అధికారంలో ఉన్న పార్టీల సంతృప్తి కోసమే, వారి కళ్ళలో వెలుగు చూడడం కోసమే.. టైమ్స్ నౌ నవభారత్ పనిచేస్తున్నట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇంత ఘనంగా దేశవ్యాప్త సర్వే చేసినట్లుగా వివరాలను వెల్లడించిన సంస్థ.. తాము ఎన్ని శాంపిల్స్ తీసుకున్నామో.. ప్రతి నియోజకవర్గంలోనూ ఎంత మంది ఓటర్లతో అభిప్రాయాలు సేకరించామో ఆ వివరాలను వెల్లడించలేదు. ఇలాంటి ఉబుసుపోని సర్వేలు కేవలం కొందరి సంతృప్తి కోసం జరుగుతుంటాయని, వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఇతర మార్గాల్లో వారి ద్వారా లబ్ధి పొందడానికి జరుగుతుంటాయని పలువురు భావిస్తున్నారు. ఈ సర్వే ఫలితాలను చూసి ప్రజలకు చూపించి అధికారంలో ఉన్న పార్టీలు, వారి కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు.