కులాన్ని నిచ్చెన మెట్లులాగా వాడుకుని అందలాలు ఎక్కిపోవడం, తమ తమ స్వప్రయోజనాలను నెరవేర్చుకుంటూ.. మధ్యమధ్యల కులాల ప్రయోజనాల గురించి నినాదాలు చేస్తూ నాటకీయమైన రాజకీయ ప్రస్థానం సాగించడం చాలా మందికి అలవాటు. ప్రస్తుతం బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య కూడా అలాంటి వైఖరినే ప్రదర్శిస్తున్నారు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగి తాను ఎమ్మెల్యేగా గెలిచి, ఓడిపోయిన పార్టీని విస్మరించిన ఈ నాయకుడు.. ఆ తరువాత జగన్మోహన్ పంచన చేరి రాజ్య సభ సభ్యత్వాన్ని దక్కించుకున్నారు. అప్పటినుంచి బీసీలకు జగన్ చేసినంత మేలు ప్రపంచంలో మరెవ్వరూ చేయలేదంటూ జగన్ బాకా ఊదడానికి మాత్రం పరిమితం అయ్యారు.
తాజాగా బీసీ సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించిన కృష్ణయ్య కేంద్రప్రభుత్వం ప్రత్యేకంగా బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. ఆయన అక్కడితో ఆగడం లేదు. పార్లమెంటులో ప్రత్యేకంగా బీసీ బిల్లు ప్రవేశ పెట్టి చట్టసభల్లో కూడా బీసీలకు యాభై శాతం రిజర్వేషన్ కల్పించడం గురించి డిమాండ్ చేస్తున్నారు. బీసీలకోసం కేంద్ర బడ్జెట్ లో రెండు లక్షల కోట్లు కేటాయించాలని అంటున్నారు.
చట్టసభల్లో యాభై శాతం బీసీలకు రిజర్వు చేయాలని డిమాండ్ చేసే ముందు.. ఆర్. కృష్ణయ్య.. తన పార్టీ అధినేత వైఎస్ జగన్ ద్వారా… కనీసం 175 ఎమ్మెల్యే సీట్లకు గాను యాభై శాతం టికెట్లు బీసీలకు ఇచ్చేలాగా ఒప్పించగలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చట్టసభల్లో బీసీలకు యాభైశాతం రిజర్వుచేసేలా చట్టం రూపుదాల్చాలంటే.. అందుకు దేశంలోని అన్ని పార్టీలు సహకరించాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఆర్.కృష్ణయ్య, తన డిమాండ్ లో సహేతుకత ఉన్నదని భావిస్తే గనుక.. ముందు ఆ దిశగా జగన్ తో ఒక ముందడుగు వేయించాలని ప్రజలు అంటున్నారు.
తెలంగాణ కు చెందిన ఆర్ కృష్ణయ్యను, ఏపీకి మాత్రమే పరిమితమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభకు పంపిస్తే.. ఆ నిర్ణయం ద్వారా.. ఏపీలోని బీసీలు అందరికీ మహోపకారం చేసినట్టుగా బిల్డప్ ఇస్తున్న ఆయన.. అచ్చంగా ఏపీలోని బీసీలకు మేలు జరిగేలా ఏదో ఒక ప్రయత్నం చేస్తే బాగుంటుంది. అందుకు.. జగన్ ద్వారా.. పార్టీలో యాభై శాతం సీట్లకు బీసీలకే టికెట్లు ఇప్పించడం సబబు అని సలహా ఇస్తున్నారు. పసలేని డిమాండ్లతో ఊదరగొట్టడం మానుకుని, ఎంపీ పదవిలో ఉన్నందుకు తను చేయగల నిర్మాణాత్మక సాయం బీసీలకు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు.